బద్వేల్ ఉపపోరులో జనసేన అభ్యర్థి..?

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని ఉబలాటపడ్డా.. చివరకు ఆ సీటుని బీజేపీకి త్యాగం చేయాల్సి వచ్చింది. బీజేపీ అభ్యర్థి రత్నప్రభకోసం పవన్ కల్యాణ్ కూడా ప్రచారం చేసిపెట్టారు. కానీ అనుకున్న స్థాయిలో అక్కడ బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రభావం చూపలేకపోయారు. ఇప్పుడు బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. అక్టోబర్ 30న పోలింగ్ కి షెడ్యూల్ విడుదలైంది. అంటే సరిగ్గా నెలరోజుల సమయం ఉంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. బీజేపీ-జనసేన కూటమి మాత్రమే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. గతంలో తిరుపతి లోక్ సభ స్థానం విషయంలో తాము సీటు త్యాగం చేశామని, ఇప్పుడు బద్వేల్ లో జనసేన అభ్యర్థిని బరిలో నిలుపుతామంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈమేరకు ఈరోజు జరగబోతున్న జనసేన విస్తృత స్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

బద్వేల్ అసెంబ్లీ స్థానానికి 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్య విజయం సాధించగా, టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్ రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానం ఇండిపెండెంట్ అభ్యర్థికి దక్కగా, నాలుగో స్థానం కాంగ్రెస్, ఐదో స్థానంలో నోటా ఉన్నాయి. అప్పట్లో పొత్తు నియమం ప్రకారం జనసేన పార్టీ, బీఎస్పీ అభ్యర్థికి మద్దతిచ్చింది. నాగిపోగు ప్రసాద్ బీఎస్పీ తరపున 1321 ఓట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి తిరువీధి జయరాములుకి 735 ఓట్లు రాగా ఆయన ఏడో స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఇదే అసెంబ్లీ స్థానంలో బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉంది.

తిరుపతి త్యాగాన్ని గుర్తు చేస్తూ బద్వేల్ లో జనసేన అభ్యర్థిని బరిలో దింపడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. అయితే ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన పార్టీ గుర్తుల్లో గాజు గ్లాసుని ఫ్రీ సింబల్ గా పేర్కొంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుతో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేశారు. అప్పుడు జనసేన కోర్టుకెక్కినా ఫలితం లేకుండా పోయింది. ఈ దశలో జనసేన అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తారా లేదా అనేది అనుమానంగా మారింది. ఒకవేళ గుర్తు సమస్యగా మారే అవకాశం ఉంటే.. పవన్ సూచించే ఉమ్మడి అభ్యర్థి కమలం గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇటీవలే పరిషత్ ఎన్నికల్లో ఉనికి చాటుకున్న జనసేన.. బద్వేల్ అసెంబ్లీ ఉపపోరులో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించాలని చూస్తోంది.