హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదు.. కొండా సురేఖ సంచలన నిర్ణయం..!

హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీపై కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం లేదని ఆమె తేల్చి చెప్పారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అక్కడ ఉప ఎన్నికలో బీజేపీ తరపున ఈటల రాజేందర్ బరిలో దిగుతుండగా.. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ ఇప్పటికే హుజురాబాద్ లో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

కాగా ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది తేల్చలేదు. హుజురాబాద్ లో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు గాను కొండా సురేఖ తో పోటీ చేయించాలని కాంగ్రెస్ భావించింది. అయితే ఆమె కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి తాను హుజురాబాద్ లో పోటీ చేసినా మళ్లీ వరంగల్ కు వెళతానని, అలాగే తమ కుటుంబానికి సంబంధించి కేటాయించే టిక్కెట్లపై కూడా షరతులు పెట్టినట్లు సమాచారం.

అయితే ఆమె పెట్టిన షరతులకు కాంగ్రెస్ పెద్దలు ఓకే చెబితే కొండా సురేఖ ఇక్కడ నుంచి పోటీ చేయడం పక్కా అని ప్రచారం జరిగింది. కాగా ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్ కు వచ్చారు. ఆయన పార్టీ సీనియర్ నాయకులతో హుజురాబాద్ లో పోటీ చేసే అభ్యర్థి విషయమై చర్చించినట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా కొండా సురేఖ తాను హుజురాబాద్ నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించారు. కొండా సురేఖ పోటీ నుంచి తప్పుకోవడంతో రవికుమార్, పత్తి కృష్ణారెడ్డి పేర్లను పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.