అశోక్‌బాబు అనుచ‌రుడిని అంద‌ల‌మెక్కిస్తున్న జ‌గ‌న్‌

వరుసబెట్టి సలహాదార్లు, కార్పొరేషన్‌ పదవుల సంతర్పణ చేస్తూ వస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తన వారెవ్వరో.. కాని వారెవ్వరో తెలుసుకునే తీరిక లేనట్లుగా వ్యవహరిస్తోంది. ఒక వేళ తెలిసినా తెలియనట్లుగా వ్యవహరిస్తోందా! అనే అనుమానం కూడా కలుగుతోంది.

సలహాదారులు ఎక్కువయ్యారంటూ రాష్ట్ర హైకోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నా.. నియామకాలు ఇంకా ఆగడం లేదు. సలహాదారులు ఉండాలా.. వద్దా? అనే నిబంధన ఏదీ ప్రభుత్వంలో లేదు. అవసరాన్ని బట్టి నియమించుకునే అవకాశం ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ జగన్‌ ప్రభుత్వంలో సలహాదారు పదవులు పునరావాసానికి పనికి వస్తున్నాయి. రాష్ట్ర ఎన్జీవోల సంఘం అధ్యక్షుడుగా ఉంటూ పదవీ విరమణ చేసిన చంద్రశేఖర్‌రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడమే ఒక విడ్డూరంగా ఉంది. చంద్రబాబు అధికారంలో ఉండగా జరిగిన 2019 ఎన్నికలకు ముందు ‘మళ్లీ బాబే రావాలి.. ’ అంటూ గట్టిగా నినదించిన మహానుభావుడాయన. టీడీపీ ఎమ్మెల్సీ, ఒకప్పటి ఎన్జీవోల నేత అశోక్‌బాబుకు నమ్మినబంటు కూడా..

అశోక్‌బాబు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎంత కసితో పోరుకు వస్తాడో రాష్ట్ర ప్రజలకు తెలియనిదేమీ కాదు. మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో వచ్చినపుడు అప్పటి మండలి ఛైర్మన్‌ షరీఫ్‌పై అశోక్‌బాబు టీడీపీ తరపున ఎంత ఒత్తిడి చేశాడో.. ఆ తరువాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత యాగీ చేశాడో అందరికీ తెలుసు. అలాంటి అశోక్‌బాబుకు నమ్మినబంటు అయిన చంద్రశేఖరరెడ్డి ఇప్పుడు జగన్‌కు ఎలా ముద్దు అయ్యాడో అంతు చిక్కని విషయంగా ఉంది. చంద్రబాబుతో ఒక సారి స్నేహం చేసిన ఉద్యోగులు, అధికారులు ఆ అనుబంధాన్ని ఒక పట్టాన వదులుకోరన్న సత్యం జగన్‌కు గాని, ఆయన చుట్టు పక్కల ఉన్న వారికి గానీ అవగతం కాలేదా? అనేది ఆశ్చర్యమే.

చంద్రబాబు మళ్లీ గెలవాలని లోపాయికారీగా 2019 ఎన్నికల్లో పని చేసిన వ్యక్తిగా చంద్రశేఖరరెడ్డిని చెప్పుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ విషయాల సలహాదారుగా ఆయనను నియమించాల్సిన అవసరం ఏముందో కూడా ప్రభుత్వానికి స్పష్టత ఉన్నట్లు లేదు. చంద్రబాబు ఓడిపోగానే జగన్‌ కోటరీ దరి చేరిన చంద్రశేఖరరెడ్డి తాను జగన్‌కు అనుకూలంగా మారిపోయానని చెప్పగానే వారు నమ్మేశారట. రిటైర్‌ కాగానే మంచి పదవి ఇస్తామని ఆయనకు హామీ ఇచ్చారట. ఆ హామీ మేరకే ఇపుడు ఆయన సలహాదారు అవతారం ఎత్తబోతున్నాడు.

కడప జిల్లాకు చెందిన, జగన్‌కు సన్నిహితంగా ఉంటున్న ఓ అధికారి, ఓ సలహాదారు ఆశీస్సులతో ఆయన ఈ పదవి పొందారనే ప్రచారం ఉద్యోగవర్గాల్లో ఉంది. కొత్తగా నియమితుడైన సలహాదారు ఉద్యోగ వ్యవహరాల్లో ఏం సలహాలు ఇస్తాడో గానీ.. అవతలి వర్గానికి మాత్రం ఒక సమాచార వనరుగా ఉంటారనడంలో సందేహం లేదనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇదేంటి? బాబే మళ్లీ రావాలి అన్న వారికి జగన్‌ పదవులు ఎలా ఇస్తున్నారని విస్తుపోతున్న వారికి.. ‘డామిట్‌ ఏమిట్రా ఇదంటే.. ప్రే ఇటీజ్‌ రాజకీయం అందాం’ అనే సమాధానం వస్తోందని ముఖ్యమంత్రి కార్యాలయంలో చెవులు కొరుక్కుంటున్నారు.