ఏపీ ఎమ్మెల్యేల పనితీరుపై ఆసక్తికర సర్వే.. 89మంది ఫెయిల్..

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తోంది. ఎన్నికలకింకా రెండున్నరేళ్లకు పైగా సమయం ఉండగానే.. ఏపీలో రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల మూడ్ వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఈ దశలో అసలు ఏపీలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తిరిగి ఎంతమంది గెలవగలరు, సిట్టింగుల్లో ఎంతమందిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, మంత్రులకు వచ్చిన మార్కులెన్ని, అసలు జగన్ ప్రభుత్వాన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు..? ఇలాంటి అంశాలన్నిటిపై ఓ ఆసక్తికర సర్వే జరిగింది. ఈ సర్వే చేసిందెవరో అనామకులు కాదు. సిఫాలజీ అనబడే సూక్ష్మ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న ఐఐటీ స్టూడెంట్స్. ఈ ఐఐటీ స్టూడెంట్స్ టీమ్.. మూడు విడతలుగా ఏపీలో ఈ సర్వే చేపట్టింది. మొత్తం ఓటర్లను 8కేటగిరీలుగా విభజించి 68,200మంది వద్ద సమాచారం సేకరించి విశ్లేషించి.. ఈ వివరాలు తెలియజేసింది.

సర్వే సారాంశం ఇదీ..
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో సదభిప్రాయం ఉన్నా కూడా.. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై స్థానికంగా అసంతృప్తి ఉంది. మొత్తం 46మంది వైసీపీ ఎమ్మెల్యేలు 8మంది ఎంపీలపై ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉందని ఈ సర్వే తేల్చి చెప్పింది. వీరి పనితీరుకి సగటున వందకి ఒక్కొకరికి కేవలం 27మార్కులు మాత్రమే వచ్చాయి. ఇక మరో 20మంది ఎమ్మెల్యేల పనితీరుకి 27నుంచి 35శాతం మధ్యలో మార్కులొచ్చాయి. అంటే వారికి కూడా పాస్ మార్కులు రాలేదు. ఇక వైసీపీకి చెందిన 22మంది లోక్ సభ సభ్యుల్లో 8మంది పనితీరు సరిగా లేదని స్థానిక ప్రజల అభిప్రాయం.

మంత్రులుగా ఓకే.. ఎమ్మెల్యేలుగా డౌటే..
జగన్ కేబినెట్ లోని 11మంది మంత్రుల పర్ఫామెన్స్ చాలా తక్కువగా ఉన్నట్టు ఈ సర్వే చెబుతోంది. సదరు మంత్రులు తమతమ నియోజకవర్గాల్లో ప్రజామోదాన్ని పొందలేకపోతున్నారు. మంత్రులుగా వారి పనితీరు ఎలా ఉన్నా.. ఎమ్మెల్యేలుగా సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదనే బాధ ప్రజల్లో ఉంది.

టీడీపీకి హోల్ సేల్ గా కష్టమే..
టీడీపీ తరపున గెలిచిన 23మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సర్వే సారాంశం. చంద్రబాబు సహా మిగిలిన ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు వారికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశముంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఇప్పటి వరకూ జరిగిన పంచాయతీ, మున్సిపాల్టీ, పరిషత్, తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ వరుస విజయాలను సాధిస్తూనే ఉంది. 2019లో వైసీపీ, టీడీపీ మధ్య ఉన్న ఓట్ల తేడా 10శాతంకంటే ఎక్కువగా ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 46.5 శాతం మంది, టీడీపీకి 43.5 శాతం మంది మద్దతు తెలిపే అవకాశముందని ఈ సర్వే చెబుతోంది. ఎన్నికలకింకా సమయం ఉంది కాబట్టి ఓటు ఎవరికి వేసేదీ చెప్పలేమంటూ 4.75 శాతంమంది తటస్థుల కేటగిరీలో ఉన్నారు. వీరిపైనే రేపు పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సర్వే చెబుతోంది.