వర్షాకాలంలో అత్యంత ప్రమాదకరమైన నగరం హైదరాబాద్..

ప్రపంచ స్థాయి నగరాల సరసన చేరిన హైదరాబాద్, పెట్టుబడులను ఆకర్షించడంలో నెంబర్-1 గా కొనసాగుతున్నా.. ప్రజల జీవితాలతో చెలగాటమాడటంలో కూడా అంతే అపఖ్యాతి మూటగట్టుకుంటోంది. ముఖ్యంగా వానలు, వరదల సమయంలో హైదరాబాద్ అత్యంత ప్రమాదకరమైన నగరంగా పలు సర్వేలు చెబుతున్నాయి. వర్షాకాలంలో ఇంటిలోనుంచి రోడ్లపైకి ఎవరైనా వస్తే.. తిరిగి ఇంటికెళ్తారన్న గ్యారెంటీ లేదు. ఇటీవల డ్రైనేజీ కాల్వలో పడి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోవడం, తాజాగా.. కుత్బుల్లాపూర్ లో మరో వృద్ధుడు వరదనీటిలోకి జారుకుని కొట్టుకుపోవడం వంటి సంఘటనలు హైదరాబాద్ లో జీవన భద్రత ఎంత దిగజారుతోందనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

హైదరాబాద్ లో ఓపెన్ నాళాలు, కాల్వలు 40కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వీటికి రక్షణ గోడలు కానీ, కనీసం ఐరన్ మెష్ తో అడ్డుగా వేసిన నిర్మాణాలు కానీ లేవు. వర్షాలు పడితే ఈ నాలాళ్లోకి నేరుగా నీరు వెళ్తుంది. అంటే వర్షపు నీటితో కొట్టుకొచ్చిన వస్తువైనా, మనిషి అయినా కాల్వలో పడ్డాడంటే ఆ ప్రవాహానికి కొట్టుకు పోవాల్సిందే. ఆ మరుసటి రోజున శవాన్ని ఏదైనా చెరువులో వెదుక్కోవాల్సిందే. అలా ఉంది పరిస్థితి. గులాబ్ తుపానుతో కురిసిన భారీ వర్షాలకు ఏకంగా ఇద్దరు ఇదే రీతిలో కొట్టుకుపోయారు. వీరిలో ఒకరి శవం మాత్రమే దొరికింది.

గత జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా.. టీఆర్ఎస్ 100 సీట్ల టార్గెట్ చేరుకోలేకపోయింది. మేయర్ పీఠం దక్కించుకోడానికి కూడా అవస్థలు పడింది. అప్పటికప్పుడు నష్టపరిహారం విషయంలో హడావిడి చేసినా, ఆ తర్వాత సిటీలో డ్రైనేజీ నిర్వహణకోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందా అంటే లేదనే చెప్పాలి. దాని ఫలితమే తాజా సంఘటనలు. పెరుగుతున్న జనాభాతో చెరువులన్నీ ఊర్లు అయిన వేళ.. సరైన వర్షం పడితే దాదాపుగా జనావాసాలన్నీ నీటి ముంపుని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అయితే అలా వస్తున్న నీటిని.. బయటకు పంపే వ్యవస్థ సరిగా ఉంటేనే ఉపద్రవాలు తక్కువగా జరుగుతుంటాయి. అది కొరవడటం వల్లే ప్రస్తుతం హైదరాబాద్ ప్రమాదకరనగరంగా మారుతోంది.