జంగ్ సైరన్ మోగకుండా అడ్డుకున్న తెలంగాణ సర్కార్..

విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిరసన కార్యక్రమాలు, సభలకు సిద్ధమైంది. ఇటీవల దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో భారీ బహిరంగ సభలతో పార్టీ శ్రేణుల్ని హుషారెత్తించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అదే స్పీడ్ లో జంగ్ సైరన్ కి పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టి డిసెంబర్ వరకు నడిపించాలని చూశారు. కానీ మొదటి రోజే కేసీఆర్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంది, జంగ్ సైరన్ మోగకుండా బ్రేక్ వేసింది.

హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ నుంచి, కొత్త పేట వరకు భారీ ర్యాలీ చేపట్టి తెలంగాణ ఉద్య సమయంలో అమరుడైన విద్యార్థి నాయకుడు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించి జంగ్ సైరన్ మోగించాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. అయితే రేవంత్ రెడ్డిని ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీ జయంతి రోజున కనీసం శ్రీకాంతాచారికి నివాళులర్పించే హక్కు కూడా మాకు లేదా అని ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి ఇంటి వద్దే బైఠాయించారు, ఆందోళనకు దిగారు.

దిల్ సుఖ్ నగర్ లో హై అలర్ట్..
మరోవైపు పోలీసులు దిల్ సుఖ్ నగర్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు. నిరసన ప్రదర్శనకోసం కాంగ్రెస్ శ్రేణుల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దుకాణాలను మూసివేయించారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాంగ్రెస్‌ జంగ్‌ సైరన్‌ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఉప ఎన్నికలపై సైరన్ ప్రభావం ఉంటుందనే అనుమానమా..?
హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల ప్రతి అడుగునీ అధికార టీఆర్ఎస్ జాగ్రత్తగా గమనిస్తోంది. గతంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంతో కాంగ్రెస్ కి బాగా మైలేజీ వచ్చిందని టీఆర్ఎస్ అనుమానిస్తోంది. అందుకే ఈ దఫా జంగ్ సైరన్ మోగకుండా ఆదిలోనే అడ్డుకట్ట వేసింది. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ.. కాంగ్రెస్ ఆరోపిస్తోంది. విద్యార్థుల, నిరుద్యోగుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ దశలో జంగ్ సైరన్ ప్రభావం హుజూరాబాద్ ఉప ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ ప్రభుత్వం తమని అడ్డుకుంటోందంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.