శ్రమదానం చేసిన పవన్.. బాగా నటించారంటూ వైసీపీ సెటైర్లు..

పోలీస్ ఆంక్షల మధ్య రాజమండ్రిలో పవన్ కల్యాణ్ శ్రమదానం చేసి, రోడ్ల మరమ్మతు కార్యక్రమంలో పాల్గొన్నారు. బహిరంగ సభలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ పార్టీ నడపటం అంత సులువు కాదని, ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చానని చెప్పారు. పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తనకోసమే ఆలోచిస్తే తిట్టినవారిని కింద కూర్చోబెట్టి నార తీసేవాడినని చెప్పిన పవన్, ప్రజల కోసమే తిట్లు తింటున్నానని, ఇంతకాలం తాను మానసిక అత్యాచారాలు భరించానని చెప్పారు. తన సహనాన్ని తేలిగ్గా తీసుకోవద్దన్నారు.

పవర్‌ వచ్చాకే పవర్‌ స్టార్‌..
అభిమానులు సంయమనం పాటించాలని తనకి పవర్ వచ్చాకే పవర్ స్టార్ అని పిలవాలని హితవు పలికారు. అరిచి గోల చేస్తున్న అభిమానులు, తాను పోటీ చేసినప్పుడు తనను కూడా గెలిపించుకోలేకపోయారని చెప్పారు. సీఎం అయ్యాకే సీఎం సీఎం అంటూ నినాదాలు చేయాలని అన్నారు. పోలీసులే తమ వెంట పడితే తామింక ఎవరికి చెప్పకోవాలని ప్రశ్నించారు పవన్. క్రిమినల్‌ గ్యాంగ్‌ కు వంతపాడి సెల్యూట్‌ చేయడం బాధగా ఉందని, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు వారి పని వాళ్లు చేయాలని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో జనసేన విజయకేతనం ఎగురవేస్తుందని, జనసేన అంటే వైసీపీకి భయం ఉంది కాబట్టే సభకు వచ్చే వారిని అడ్డుకున్నారని మండిపడ్డారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజలు ముందుకొస్తే తప్ప రాష్ట్రం బాగుపడదని అన్నారు పవన్. సమాజంలో మార్పు అనేది గోదావరి జిల్లాలపై ఆధారపడి ఉందని చెప్పారు.

పవన్ సభపై సెటైర్లు..
పవన్ కల్యాణ్ రోడ్ల మరమ్మతు కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేయడంపై వైసీపీ నేతలు వెంటనే కౌంటర్లు మొదలు పెట్టారు. 12 ఏళ్లలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయానన్న బాధ పవన్‌ కల్యాణ్‌లో కనిపిస్తోందని అన్నారు మంత్రి కన్నబాబు. వచ్చే ఎన్నికల్లో కులాల కుంపటి రాజేస్తామని పవన్ చెబుతున్నారని, ఆయన చంద్రబాబుతో కలిసి రాజకీయాలు చేస్తారని అందరికీ అర్థం అయిపోయిందని మండిపడ్డారు. జగన్‌ సీఎం అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన పవన్‌ తన మాట మర్చిపోయారేమోనని ఎద్దేవా చేశారు మంత్రి కన్నబాబు. సరిగ్గా ఒక నిముషం 8 సెకన్లపాటు పవన్ శ్రమదానం చేశారని.. స్టార్ట్, కెమెరా, యాక్షన్ అనేలోపు అంతా అయిపోయిందన్నారని, శ్రమదానంలో ఇదో కొత్త ట్రెండ్ అని అన్నారు కన్నబాబు. గాంధీ జయంతి రోజున వైసీపీపై యుద్ధం చేస్తాననడం పవన్ కే చెల్లిందని సెటైర్లు పేల్చారు.