వాయిదాల్లో రికార్డ్ సృష్టించిన సినిమా

ఒక సినిమా ఒకసారి వాయిదా పడుతుంది, లేదంటే రెండు సార్లు. కరోనా పరిస్థితుల వద్ద 3-4 సార్లు వాయిదా పడినప్పటికీ సర్దుకోవచ్చు. కానీ ఒకే సినిమా కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇంకా చెప్పాలంటే వాయిదాల్లో ఆ సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఏ సినిమాకు ఇన్ని వాయిదాలు చూడలేదు టాలీవుడ్. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా..? ఆరడుగుల బుల్లెట్.

గోపీచంద్, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇప్పటిది కాదు. దాదాపు నాలుగేళ్ల కిందటి
సినిమా ఇది. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ మీద తాండ్ర రమేష్ నిర్మించారు. ఇప్పుడీ సినిమాకు ఫ్రెష్ గా మరో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.

ఈనెల 8న ఆరడుగుల బుల్లెట్ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించాడు నిర్మాత. ఈసారి
విడుదల ఖాయం అనిపించేలా ఉంది. ఎందుకంటే.. రేపు ట్రయిలర్ రిలీజ్ చేస్తున్నారు. మరో 3 రోజుల్లో
ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా చేస్తున్నారు. అలా ఈ సినిమాకు మోక్షం లభించబోతోంది.

ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. వక్కంతం వంశీ కథ అందించగా.. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు.