కేరళలో సీఎం వర్సెస్ డాక్టర్లు.. కరోనా హోమియో మందులపై రగడ

కేరళలో నవంబర్ 1నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అదే సమయంలో స్కూల్ వయసున్న పిల్లలందరికీ ఉచితంగా హోమియోపతి మందుల్ని పంపిణీ చేయబోతోంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, కరోనాని కట్టడి చేయగలవనే పేరుతో హోమియోపతి మాత్రల్ని పిల్లలకు అందించేందుకు సిద్దం చేసింది. కేంద్ర ఆయుష్ విభాగం అనుమతించిన మందుల్ని దీనికి ఉపయోగిస్తున్నట్టు ప్రకటించారు సీఎం పినరయి విజయన్. ఆర్సెనిక్ ఆల్బం అనే మందుని ఆయుష్ విభాగం సూచించిందని, 21రోజులపాటు రోజుకి మూడు మాత్రలు చిన్నారులకు అందించేలా వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలిచ్చారు. అయితే కేరళ అల్లోపతి వైద్యుల విభాగం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టుని ఆశ్రయించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేరళ విభాగం సిద్ధమవుతోంది. గతంలో ఆయుష్ విభాగం దీనిపై ఇచ్చిన ఆదేశాలను కూడా రద్దు చేసేలా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేస్తామంటున్నారు ఐఎంఏ ప్రతినిధులు. హోమియోపతి మాత్రల వల్ల పిల్లలకు ఉపయోగం ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.. చిన్న పిల్లల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని ముందే తుంచేసినట్టు అవుతుందని ఐఎంఏ ఆరోపిస్తోంది.

స్కూల్స్ తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంపై సంతోషం వ్యక్తం చేస్తూనే, అదే సమయంలో హోమియోపతి మాత్రలు పంపిణీ చేయడం సరికాదని ప్రభుత్వానికి తెలిపింది ఐఎంఏ. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ కూడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. కేరళ ప్రభుత్వం మాత్రం హోమియో మాత్రల పంపిణీ విషయంలో వెనకడుగేయబోమని తేల్చి చెప్పడం విశేషం. హోమియో మాత్రల విషయంలో కేరళ సీఎం, డాక్టర్ల మధ్య న్యాయపోరాటం మొదలు కాబోతోంది. దీనికి సుప్రీంకోర్టు ఎలాంటి ముగింపునిస్తుందో చూడాలి.