”మా” ఎన్నికల నుంచి మరో వికెట్ పడింది

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నుంచి బండ్ల గణేశ్ అల్రెడీ తప్పుకున్నారు. జనరల్ సెక్రటరీ పదవికి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన బండ్ల, తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సీవీఎల్ నరసింహారావు కూడా చేరారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో, అధ్యక్ష పదవికి నామినేషన్ వేశార సీవీఎల్. ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు.

తను ఎందుకు బరి నుంచి తప్పుకున్నాననే విషయాన్ని సీవీఎల్ బయటపెట్టలేదు. మరీ ముఖ్యంగా పొద్దున్న మేనిఫెస్టో ప్రకటించి, మధ్యాహ్నానికి నామినేషన్ ను ఉపసంహరించుకోవడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ క్రమంలో మరో 2 రోజుల్లో తను ఎందుకు తప్పుకున్నాననే అంశంపై వివరణ ఇస్తానని ప్రకటించారు సీవీఎల్.

తెలంగాణ నటీనటులు, సినీకార్మికుల సంక్షేమమే ప్రధాన అజెండాగా రంగంలోకి దిగారు సీవీఎల్. ఒక దశలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను విడదీయాలని కూడా ఆయన పట్టుబడ్డారు. ఏపీకి, తెలంగాణకు విడివిడిగా అసోసియేషన్లు ఏర్పాటు చేయాలని, అప్పుడే తెలంగాణ సినీకార్మికులకు, నటులకు న్యాయం జరుగుతుందని ఆయన తన వాణిని గట్టిగా వినిపించారు. సీవీఎల్ కు విజయశాంతి లాంటి ప్రముఖులు బాహాటంగా మద్దతిచ్చారు. ఇంత జరిగిన తర్వాత సీవీఎల్ తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడం
చర్చనీయాంశమైంది.