జనసేనకు దగ్గరగా టీడీపీ.. బద్వేల్ బరిలో బీజేపీ..

2024నాటికి ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయని చెప్పడానికి బద్వేల్ ఉప ఎన్నిక ఒక ఉదాహరణగా నిలవబోతోంది. ఇటీవల కాలంలో బీజేపీ, జనసేన మైత్రిపై చాలా అనుమానాలు మొదలయ్యాయి. బద్వేల్ బైపోల్ తో అవిప్పుడు బలపడబోతున్నాయి. అదే సమయంలో జనసేన మరోసారి టీడీపీకి దగ్గరవుతుందనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. వాటికి కూడా బద్వేల్ ఉప ఎన్నికే సమాధానమిచ్చేస్తోంది.

బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ తరపున దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధ బరిలో దిగుతున్నారు. ఈమేరకు ప్రకటన విడుదలై చాలా రోజులైంది. అయితే ఇప్పుడు టీడీపీ ఈ ఉప ఎన్నికనుంచి తప్పుకున్నట్టు ప్రకటించింది. దానికి కారణం.. వైసీపీ టికెట్ వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకే ఇవ్వడం అని చెబుతోంది. టీడీపీ ఉప ఎన్నికకు దూరం జరగడానికి కారణం ఇదే అయితే.. ఈ నిర్ణయం ఇంతకు ముందే తీసుకుని ఉండాలి. కానీ జనసేనాని బద్వేల్ బైపోల్ కి తాను దూరం అని ప్రకటించిన మరుసటి రోజే టీడీపీ కూడా అదే నిర్ణయాన్ని వ్యక్తపరచడం విశేషం.

జనసేనకు దూరంగా బీజేపీ..
దివంగత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చారు కాబట్టి తాము ఆ పోటీకి దూరం అన్నారు పవన్ కల్యాణ్. అదే సమయంలో అక్కడ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలంటూ వైసీపీకి సూచించారు. పవన్ బాటలో ఇప్పుడు టీడీపీ బరిలోనుంచి తప్పుకుంది. మరి జనసేన మిత్రపక్షం బీజేపీ కూడా అదే పనిచేయాల్సి ఉంది. కానీ బీజేపీ మాత్రం బద్వేల్ ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. వారసత్వ రాజకీయాలకు తమ పార్టీ దూరమని, బద్వేల్ ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అంటే ఒకరకంగా పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకించినట్టే లెక్క.

2024నాటికి ఏపీలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి..?
బద్వేల్ లో బీజేపీ అభ్యర్థిని నిలబెడితే, పవన్ వారికి సపోర్ట్ ఇవ్వను అని చెబితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. పొత్తు ధర్మం అక్కడ అటకెక్కినట్టే అనుకోవాలి. అదే సమయంలో ఒకే మాట, ఒకే నిర్ణయం అంటూ.. బద్వేల్ ఉప ఎన్నికలకు ఉమ్మడిగా దూరం ఉంటున్న టీడీపీ, జనసేన మధ్య మైత్రి చిగురిస్తుందనే చెప్పాలి. 2024నాటికి ఏపీలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయనే విషయంపై బద్వేల్ ఉప ఎన్నిక ఓ క్లారిటీ ఇచ్చినట్టయింది.