పోటీయే వద్దన్న పవన్, ప్రచారానికి వస్తారా..?

టీడీపీ, జనసేన పోటీనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో ఏపీలో బద్వేల్ ఉప ఎన్నిక నామమాత్రంగా మారిపోయింది. అధికార వైసీపీ ఉప ఎన్నిక ప్రచార ఇన్ చార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించి, మండలానికో ఎమ్మెల్యేను కేటాయించి ఇప్పటికే ప్రచార రంగంలోకి దిగింది. బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు కానీ, వారసత్వ రాజకీయాలు తమకు నచ్చవనే లాజిక్ తో పోటీలో ఉంటామని తేల్చి చెప్పింది. అయితే తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎన్నికల బరిలోకి పవన్ ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఉప ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు పవన్ కి అప్పగిస్తామన్నారు, బీజేపీ అభ్యర్థి తరపున ఆయన్ను ప్రచారానికి పిలుస్తామన్నారు.

పవన్ వస్తారా..?
పొత్తు నియమం ప్రకారం తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. ఇప్పుడు బద్వేల్ లో కూడా బీజేపీ పోటీలో ఉంటే పవన్ ప్రచారం చేయాల్సిందే. కానీ ఆయన స్వయానా తన పార్టీ పోటీలో లేదంటూ ఇప్పటికే ప్రకటించారు. పైగా సంప్రదాయాన్ని పాటిస్తున్నానని చెప్పారు. ఆ సాంప్రదాయం ప్రకారం బద్వేల్ పోటీ ఏకగ్రీవం అయితే సంతోషిస్తానన్నారు. ఏకగ్రీవం చేసుకోవాలంటూ వైసీపీకి సలహా కూడా ఇచ్చారు. పవన్ ప్రకటన వెలువడిన మరుసటి రోజే చంద్రబాబు కూడా టీడీపీ బద్వేల్ బరిలో లేదంటూ ప్రకటించారు. అంటే ఒకరకంగా పవన్ ప్రకటన వల్ల రెండు పార్టీలు పోటీలో లేకుండా పోయాయి.

సొంత పార్టీ అభ్యర్థినే పోటీకి దింపేది లేదని తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్, తన మాటను తానే కాదంటారా. అప్పుడు సంప్రదాయం అని చెప్పిన జనసేనాని, రేపు ప్రచారానికి వెళ్తే ఓటర్లకు ఏమని సమాధానం చెబుతారు. ఏకగ్రీవానికి ప్రయత్నం చేయాలని వైసీపీకి చెప్పిన పవన్, తానే నేరుగా బీజేపీ తరపున ప్రచార బాధ్యతలు చేపడితే దానికి అర్థమేముంటుంది. వీర్రాజుకి ఈ విషయం తెలియక కాదు. కానీ పవన్ ని కూడా అప్రయత్నంగానే ఎన్నికల సీన్ లోకి తీసుకొచ్చేశారు. మరి పవన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. బీజేపీ అభ్యర్థికి తాను మద్దతివ్వను, ఆయన తరపున ప్రచారం చేయను అని నేరుగా చెప్పేస్తారా..? లేక జనసైనికులు ఆత్మసాక్షి ప్రకారం ఈ ఎన్నికల్లో నచ్చినవారికి ఓటు వేయమని చెబుతారా..? ఎన్నికలు వద్దు అని వెనక్కు తగ్గిన పవన్ తో మరోసారి స్టేట్ మెంట్ ఇచ్చేలా ఇరికించేశారు వీర్రాజు.