పుష్పతో కలిసి వస్తున్న ఆచార్య

ఆచార్య సినిమాకు సరైన డేట్ దొరకలేదు. సంక్రాంతికి వద్దామనుకుంటే చిరంజీవి కంటే ముందే ప్రభాస్,
మహేష్, పవన్ కల్యాణ్ లాంటి హీరోలు డేట్స్ పట్టేశారు. ముందే ప్రకటనలు ఇచ్చి కర్చీఫ్ వేశారు. ఇది
చాలదన్నట్టు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా తయారైంది. ఇలాంటి టైమ్ లో తన ఆచార్యను కూడా సంక్రాంతి బరిలో దింపితే, అది చిరంజీవి పెద్దరికానికే మచ్చ.

అందుకే మధ్యేమార్గంగా సంక్రాంతి సీజన్ కు కాస్త ముందు థియేటర్లలోకి రావాలని నిర్ణయించారు చిరంజీవి. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ మూడో వారంలో ఆచార్యను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇంతకుమించి ఆచార్యకు ప్రత్యామ్నాయం లేదు మరి.

డిసెంబర్ 17న పుష్ప సినిమా ఉంది. జనవరి 7న ఆర్ఆర్ఆర్ ఉంది. ఈ రెండు సినిమాల మధ్యలో ఆచార్యను దించి, ఉన్నంతలో కలెక్షన్లు రాబట్టాలనేది చిరు ఐడియా. డిసెంబర్ 17 కంటే ముందు ఆచార్య రెడీ అవ్వదు. పోనీ సంక్రాంతి తర్వాత రిలీజ్ చేద్దామంటే అప్పటికే చాలా ఆలస్యమైతుంది. అందుకే ఇలా మధ్యేమార్గంగా.. పుష్ప, ఆర్ఆర్ఆర్ మధ్యలో ఆచార్యను రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది.