బాలయ్య సినిమాపై బి.గోపాల్ క్లారిటీ

అఖండ సినిమా సెట్స్ పైకి రాకముందు మాట. ఆ టైమ్ లో బాలయ్య-బి.గోపాల్ కాంబినేషన్ పై జోరుగా చర్చ నడించింది. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి సినిమాల తర్వాత వీళ్లిద్దరి కాంబోలో మరో బ్లాక్ బస్టర్ కు లైన్ రెడీ అవుతోందని అంతా అనుకున్నారు. కానీ ఉన్నట్టుంది ఆ సినిమా ఆగిపోయింది. ఇన్నాళ్లకు ఆ ప్రాజెక్టుపై దర్శకుడు బి.గోపాల్ స్పందించారు.

“ఫ్యాక్షన్ కథ చేస్తున్నామని సినిమా చేస్తున్నంత వరకు నాకు తెలీదు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, ఇంద్ర సమయంలోనూ ఫ్యాక్షన్ సినిమా చేస్తున్నాను అని అనుకోలేదు. ఇప్పుడు కూడా ఎవరైనా కథ చెబితే.. ఫ్యాక్షన్ డ్రాప్‌లో డైరెక్షన్ చేసేందుకు రెడీగా ఉన్నాను. బాలయ్య బాబుతో సినిమా చేయాలని చాలా ట్రై చేశాను. కానీ స్క్రిప్ట్ సరిగ్గా రాకపోవడంతో ఆలస్యమవుతూ వచ్చింది. బాలయ్య బాబుతో సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి కంటే బ్లాక్ బస్టర్ హిట్ తీయాలనే కోరిక ఉంది.”

ఇలా స్క్రిప్ట్ సెట్ అవ్వక, బాలకృష్ణతో సినిమా చేయలేకపోయిన విషయాన్ని బి.గోపాల్ బయటపెట్టారు.
ఇప్పటివరకు తను కథలు రాయలేదని.. రచయిత కథలతోనే డైరక్షన్ చేశానని.. కథ నచ్చకపోతే మెగాఫోన్ పట్టుకోనని అంటున్నారు ఈ సీనియర్ డైరక్టర్.

“నేను చేసినవి ఏవీ కూడా నా కథలు కాదు. సీనియర్ రచయితలు,కొత్త రచయితలను అందరినీ
అడుగుతుంటాను. మస్కా సినిమాతో కొత్త రచయితను పరిచయం చేశాను. చిన్ని కృష్ణను కూడా నేనే
పరిచయం చేశాను. నాకు కథ నచ్చితేనే సినిమాకు న్యాయం చేయగలుగుతాను.”

దాదాపు మూడేళ్ల కిందట బి.గోపాల్ డైరక్ట్ చేసిన ఆరడుగుల బుల్లెట్ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి
వస్తోంది. గోపీచంద్, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో గోపీచంద్ తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించారు.