మొత్తంగా ఓపెన్ అయిన నాగబాబు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ప్రచారం పీక్ స్టేజ్ కు చేరుకుంది. మరో 4 రోజుల్లో ఓటింగ్ ఉందనగా.. మెగా కాంపౌండ్ ఫుల్ గా దిగిపోయింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు సంబంధించి ఈరోజు నాగబాబు విస్పష్ట ప్రకటన చేశారు. ప్రకాష్ రాజ్ కు మెగా కాంపౌండ్ లో హీరోలందరి మద్దతు ఉంటుందని బాహాటంగా ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా మంచు విష్ణు ప్యానెల్ చేస్తున్న ఎన్నో ఆరోపణలపై సవివరంగా స్పందించారు నాగబాబు. ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్ వైపు ఉన్నారా.. టాలీవుడ్ వైపు ఉన్నారా అంటూ అడిగిన మంచు విష్ణు వాదనను నాగబాబు కొట్టేశారు. పవన్ టాలీవుడ్ లో అంతర్భాగం అన్నారు.

లోకల్, నాన్-లోకల్ అంశంపై కూడా సూటిగా స్పందించారు. ఏ పనీ చేయని ఓ తెలుగువాడ్ని అధ్యక్షుడిగా పెట్టుకుందామా.. ఏ పనైనా చేయగలిగే సమర్థుడ్ని అధ్యక్షుడిగా తెచ్చుకుందామా అని సూటిగా ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ ను కన్నడిగుడు అంటున్న మంచు విష్ణు ప్యానెల్ అభ్యర్థులు.. ప్రకాష్ రాజ్ ను ఇండియన్ ఆర్టిస్ట్ గా చూడాలని సూచించారు.