సడెన్ గా బన్నీ ఎందుకొచ్చాడో తెలుసా?

ఉన్నట్టుండి సడెన్ గా ఎఫ్3 మూవీ సెట్స్ లో ప్రత్యక్షమయ్యాడు అల్లు అర్జున్. ఓవైపు పుష్ప షూటింగ్ లో
బిజీగా ఉంటూ, ఇలా ఎఫ్3 సెట్స్ కి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. సెట్స్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ ను కలిశాడు బన్నీ. సునీల్, రాజేంద్రప్రసాద్ కూడా అక్కడే ఉన్నారు. అందరితో చక్కగా మాట్లాడాడు. ఇంతకీ బన్నీ ఎందుకొచ్చాడో తెలుసా?

తాజా సమాచారం ప్రకారం.. అనీల్ రావిపూడితో కథాచర్చల కోసం బన్నీ ఎఫ్3 సెట్స్ కు వచ్చినట్టు
తెలుస్తోంది. నెరేషన్ కోసం బన్నీ సెట్స్ కు వచ్చాడా లేక సరదాగా సెట్స్ కొచ్చిన బన్నీకి అనీల్ రావిపూడి కథ చెప్పాడా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఇద్దరి మధ్య ఓ లైన్ పై చిన్నపాటి చర్చ జరిగింది.

బన్నీ ఫుల్ లెంగ్త్ కామెడీ చేసి చాన్నాళ్లయింది. అప్పుడెప్పుడో వచ్చిన జులాయి తర్వాత మళ్లీ కామెడీ
చేయలేదు. అందుకే ఈసారి కుదిరితే అనీల్ రావిపూడి దర్శకత్వంలో మంచి కామెడీ ఎంటర్ టైనర్
చేయాలనే ఆలోచనలో బన్నీ ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు మహేష్ కోసం అనీల్ రావిపూడి రాసిన లైన్ ను బన్నీ విన్నట్టు ప్రచారం జరుగుతోంది. సర్కారువారి పాట స్టార్ట్ అవ్వకముందు, మహేష్-అనీల్ రావిపూడి మధ్య స్టోరీ డిస్కషన్లు జరిగాయి. అప్పుడు మహేష్ కోసం అనుకున్న కథనే ఇప్పుడు బన్నీకి వినిపించాడంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.