కట్టె, కొట్టె, తెచ్చె.. భారతీయులకి కావాల్సింది ఇదే..!

సూటిగా, సుత్తి లేకుండా. ఒక విషయాన్ని గంటసేపు సాగదీసి చెప్పేవారికంటే, నిముషంలో సూటిగా చెప్పేవారే అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. టెక్నాలజీ పెరిగి, స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఈ షార్ట్ కట్స్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. ఎవరూ ఎక్కువసేపు ఒకే విషయం గురించి ఆలోచించట్లేదు, ఒకే విషయాన్ని అర్థం చేసుకోవాలనుకోవట్లేదు. క్లుప్తంగా వినాలనుకుంటున్నారు, చూడాలనుకుంటున్నారు. అందుకే భారత ఇంటర్నెట్ మార్కెట్ లో షార్ట్ వీడియోస్ కి డిమాండ్ భారీగా పెరిగిపోయింది.

ఇంటర్నెట్ లో కనపడే వీడియోస్ రెండు రకాలు, 2నిముషాల నిడివికంటే ఎక్కువ ఉండేవాటిని లాంగ్ ఫామ్ వీడియోస్ అంటారు. 15 సెకన్లనుంచి మొదలై రెండు నిముషాల్లోపు క్లుప్తంగా ముగిసే వాటిని షార్ట్ ఫామ్ వీడియోస్ (SFV) అంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో వీటికి డిమాండ్ భారీగా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. అందులోనూ కరోనా కష్టకాలంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోవడంతో సోషల్ మీడియాలో వీడియోలను చూసేవారి సంఖ్య పెరిగింది. భారతీయులు షార్ట్ ఫామ్ వీడియోస్ కి బాగా అలవాటు పడుతున్నారు.

ప్రతి ముగ్గురిలో ఒకరు..
2025నాటికి భారత్ లో షార్ట్ ఫామ్ వీడియోస్ ని వీక్షించే వారి సంఖ్య 60కోట్లకు చేరుతుందని ఓ నివేదిక చెబుతోంది. అదే సమయంలో సుదీర్ఘ వీడియోలు వీక్షించేవారి సంఖ్య 35కోట్లు మాత్రమే ఉంటోంది. అయితే ఇండియా ఇంటర్నెట్ వినియోగంలో వీడియోల వీక్షణ శాతం మాత్రం ఇంతా తక్కువగానే ఉండటం విశేషం. జపాన్ లో 67శాతం, ఇండోనేషియాలో 69శాతం, బ్రెజిల్ లో 74శాతం, అమెరికాలో 83శాతం, చైనాలో 92శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులు వీడియోలను వీక్షిస్తుంటారు. భారత్ లో మాత్రం అది 59శాతానికే పరిమితం అవుతోంది. రోజుకి 4.8 గంటలసేపు స్మార్ట్ ఫోన్ వాడేవారు.. సగటున గంటసేపు వీడియోలను చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. మరో విశేషం ఏంటంటే.. భారత్ లో 5కోట్ల మంది ఏదో ఒక వీడియోను ఎప్పుడో ఓసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినవారే.