ఏపీ ప్రజలకు సూచన.. ఆ టైమ్ లో ఏసీలు ఆఫ్ చేయండి..

దేశవ్యాప్తంగా ఇంధన రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఏపీలో కూడా సరిపడా బొగ్గు నిల్వలు లేక థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఈ దశలో విద్యుత్ ఆదా చేయడం ఒక్కటే ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం అని సూచిస్తున్నారు ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్. ఏపీలో విద్యుత్ వినియోగదారులకు ఆయన ఓ కీలక సూచన చేశారు. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో ఏసీ లాంటి పరికరాలు వాడకుండా ఉండటం మంచిదని సూచించారు. ఉదయం 6 గంటలనుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు ఎక్కువ విద్యుత్ ని వినియోగించే ఏసీ లాంటి పరికరాలు ఆపివేసి ఉంచాలని ప్రజల్ని కోరారు. ఆయా సమయాల్లో ఎక్కువ డబ్బుతో విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుందని, అందుకే వినియోగాన్ని తగ్గించాలని కోరారు. సాయంత్రం సమయంలో అధిక ధరపై విద్యుత్ కొనుగోలుకయ్యే ఖర్చును ఆదా చేసుకోవడానికి.. భవిష్యత్తులో సర్దుబాటు ఛార్జీలు పడకుండా ఉండేందుకు ఇలా చేయాలని సూచించారు.

ఏపీలో విద్యుత్ డిమాండ్, సరఫరాల మధ్య అంతరం చాలా ఉందని, మూడు రోజులుగా రద్దీ సమయాల్లో కొన్నిచోట్ల కోతలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ డిమాండు 20శాతం పెరిగిందని, కొవిడ్‌ కు ముందు అక్టోబరులో రోజుకు 160 మిలియన్‌ యూనిట్ల డిమాండు ఉండగా ఇప్పుడు 195 మిలియన్‌ యూనిట్లు అవసరం అవుతోందని చెప్పారు. బొగ్గు కొరత కారణంగా థర్మల్‌ ప్లాంట్లలో 40 మిలియన్‌ యూనిట్ల మేర ఉత్పత్తి తగ్గిందని, విండ్ పవర్ రెండు, మూడు మిలియన్‌ యూనిట్లకు మించి రావడం లేదని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారాయన. రద్దీ సమయాల్లో ఏసీలు ఆపేయడం ద్వారా 10 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుందని అన్నారు శ్రీకాంత్.

విద్యుత్ డిమాండ్ పెరగడంతో నెల నుంచి బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ రేట్లు భారీగా పెరిగాయని తెలిపారు శ్రీకాంత్. సెప్టెంబర్ 16న యూనిట్‌ ధర రూ.4.60 ఉండగా, సెప్టెంబర్ నెలాఖరుకు రూ.9.40కు చేరుకుందని, అక్టోబర్ 6 నాటికి రూ.14 అయిందని వివరించారు. డబ్బులు ఎక్కువ పెట్టి కొనుగోలు చేయాలనుకున్నా.. విద్యుత్ దొరకడం లేదని, దేశవ్యాప్తంగా డిమాండ్, సరఫరాకు మధ్య రెండు వేల మెగావాట్ల వ్యత్యాసం ఉందని అన్నారు. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో 5 ర్యాక్ ల బొగ్గు అదనంగా అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.