“మా”లో ఒక ఘట్టం ముగిసింది

దాదాపు 2 నెలలుగా వివాదాస్పదమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు పోలింగ్ సాగింది. రికార్డ్ స్థాయిలో అత్యధికంగా 83 శాతం పోలింగ్ నమోదైంది. “మా” చరిత్రలో ఈ స్థాయిలో పోలింగ్ జరగడం ఇదే తొలిసారి. 920 మంది సభ్యులుంటే.. వాళ్లలో 860 సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉంది. వీళ్లలో 626 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటింగ్ మొదలైన వెంటనే పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యక్షమయ్యాడు హీరో పవన్ కల్యాణ్. జూబ్లిహిల్స్ పబ్లిక్
స్కూల్ లో జరిగిన ఓ పోలింగ్ కు అందరికంటే ముందు వచ్చిన స్టార్ పవన్ కల్యాణ్ మాత్రమే. ఆ తర్వాత
చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు చకచకా వచ్చి ఓట్లేశారు. అలా పోలింగ్ ప్రారంభమైన గంట వ్యవథిలోనే 35శాతం ఓటింగ్ కనిపించింది. చాలామంది ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇబ్బంది పడ్డంతో మరో గంట టైమ్ పొడిగించారు.

2 నెలలుగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య జరిగిన మాటల యుద్ధం.. మోహన్ బాబు, నాగబాబు, నరేష్ లాంటి ప్రముఖుల జోక్యంతో ఈ సారి అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గెలుపు ఎవరిదనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.