”మా”లో ముసలం.. వరుసగా పడుతున్న వికెట్లు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ముసలం మొదలైంది. ఎప్పుడైతే మంచు విష్ణు భారీ మెజారిటీతో గెలిచాడో, ఇక అప్పట్నుంచి అసోసియేషన్ పై ఓ రకమైన వ్యతిరేక భావన క్రియేట్ చేస్తున్నారు కొందరు. దీనికి మరింత ఊతమిచ్చేలా వరుసగా రాజీనామాలు చేస్తున్నారు ప్రముఖులు.

ఎప్పుడైతే మంచు విష్ణు గెలిచాడో ఆ వెంటనే రాజీనామా అస్త్రం ప్రయోగించారు నాగబాబు. అసోసియేషన్ లో కొనసాగడం తనకు ఇష్టం లేదని, 48 గంటల్లో ప్రస్తుత అధ్యక్షుడికి తన రాజీనామా లేఖ సమర్పిస్తానని ఆయన ప్రకటించారు. ప్రాంతీయవాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం ఇష్టం లేక “మా” అసోసియేషన్లో “నా” ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించుకున్నారు నాగబాబు.

ఆ తర్వాత కొద్దిసేపటికే ఎన్నికల్లో ఓడిపోయిన అధ్యక్ష అభ్యర్థి ప్రకాష్ రాజ్ కూడా రాజీనామా ప్రకటించారు. తెలుగోడ్ని కాదు కాబట్టి తనను ఎన్నుకోలేదని, కాబట్టి అసోసియేషన్ లో తను కొనసాగడంలో అర్థం లేదన్నారు. తనకు కూడా ఆత్మగౌరవం ఉంది కాబట్టి, అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇకపై టాలీవుడ్ లో కుటుంబ సభ్యుడిగా కాకుండా, ఓ అతిధిగా మాత్రమే ఉంటానని స్పష్టంచేశారు.

ఇలా విష్ణు అధ్యక్షుడై 24 గంటలైనా గడవకముందే ఇద్దరు కీలక వ్యక్తులు “మా”కు రాజీనామా చేశారు.
ఇక్కడితో ఆగుతుందనుకున్న రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. వీళ్లతో పాటు నటుడు శివాజీరాజా
కూడా “మా”కు రాజీనామా చేశారు. కొన్ని రోజుల కిందట నరేష్ పై శివాజీరాజా తీవ్ర విమర్శలు చేశారు. “మా” లో వివాదాలకు నరేష్ రాజకీయాలే కారణమన్నారు. నరేష్ ఎప్పుడూ అబద్ధాలే మాట్లాడుతుంటాడని
విమర్శించారు.

ఇప్పటికి ఈ లెక్క మూడుతోనే ఆగింది. కానీ ప్రస్తుతం “మా”లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఈ
రాజకీయాల పర్వం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. మరింత మంది అసోసియేషన్ కు తమ
రాజీనామాలు సమర్పించబోతున్నట్టు సమాచారం. “ఆట అయిపోలేదు, ఆట ఇప్పుడే మొదలైంది.. అసలు ఆట ఇకపై చూస్తారు” అంటూ ప్రకాష్ రాజ్ తన ప్రెస్ మీట్ ను ముగించడం దేనికి సంకేతమో ప్రస్తుతానికైతే ఎవ్వరికీ అర్థంకావడం లేదు.