ఉత్తరాఖండ్ బీజేపీలో ముసలం.. ఇద్దరు సీఎంలను మార్చిన ఫలితం..

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఉత్తరాఖండ్ లో అధికార బీజేపీలో ముసలం పుట్టింది. సాక్షాత్తూ కేబినెట్ మినిస్టర్, ఎమ్మెల్యే అయిన తన కొడుకుతో సహా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం పుష్కర్ సింగ్ థామి ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పనిచేస్తున్న యశ్ పాల్ ఆర్య, ఆయన కుమారుడు సంజీవ్ ఆర్య.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఉత్తరాఖండ్ పీసీసీ చీఫ్ గా పనిచేశారు యశ్ పాల్ ఆర్య. ఆయన తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుకున్నట్టయింది.

సీఎం మార్పుతో లుకలుకలు..
2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాక త్రివేంద్ర సింగ్ రావత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. నాలుగేళ్ల తర్వాత సడన్ గా ఎమ్మెల్యేలలో తిరుగుబాటు వచ్చింది. దీంతో చేసేదేం లేక అధిష్టానం తిరత్ సింగ్ రావత్ ని సీఎంగా ఎంపిక చేసింది. అయితే ఎంపీగా ఉన్న తిరత్ సింగ్ ని తీసుకొచ్చి ఉత్తరాఖండ్ సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 6నెలల లోపు ఆయన అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. ఉత్తరాఖండ్ లో అప్పటికి మూడు నియోజకవర్గాలు ఉప ఎన్నికలకోసం ఎదురు చూస్తున్నాయి కూడా. కానీ కరోనా వల్ల ఉప ఎన్నికలు జరిగేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో అధిష్టానం మరోసారి కుర్చీలాట ఆడింది. అప్పటికే తిరత్ సింగ్ పై కూడా అసంతృప్తి జ్వాలలు చెలరేగడంతో.. పుష్కర్ సింగ్ ధామి ని సీఎంగా నియమించారు. అయితే ఈసారి కూడా బీజేపీలో లుకలుకలు చల్లారలేదని మరోసారి రుజువైంది. ఈసారి ఏకంగా మంత్రి యశ్ పాల్ ఆర్య పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.

వలసలు మొదలైనట్టేనా..?
రవాణా మంత్రితో బీజేపీ నుంచి కాంగ్రెస్ కు వలసలు మొదలయ్యాయని అంటున్నారు. మంత్రితోపాటు ఎమ్మెల్యే అయిన ఆయన కొడుకు కూడా కాంగ్రెస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 9 నుంచి 11కి చేరింది. ఉత్తరాఖండ్ ఏర్పడిన తర్వాత రెండు దఫాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఓసారి కాంగ్రెస్ గెలిస్తే మరుసటి ఎన్నికల్లో బీజేపీ గెలిచేది. అలా మార్చి మార్చి రెండు పార్టీలకు అధికారం ఇస్తున్నారు ఉత్తరాఖండ్ ప్రజలు. సెంటిమెంట్ కొనసాగితే ఈసారి అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ముందస్తు వలసలు కూడా అదే విషయానికి బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయి.