సమాచారం లేదు, హక్కు లేదు.. అసలు ఉద్యోగులే లేరు..

సమాచార హక్కు చట్టం వచ్చి సరిగ్గా నేటికి 16ఏళ్లు. అయితే ఇప్పటికీ సరైన రీతిలో అర్జీదారులకు సమాచారమే లభించడంలేదు. తాజాగా ఒడిశాలో సమాచార హక్కు చట్టం కింద అర్జీ పెట్టుకున్న ఓ వ్యక్తికి, 2028నాటికళ్లా.. వారు అడిగిన సమాచారం ఇస్తామని తేల్చి చెప్పారు అధికారులు. దీంతో అవాక్కవడం అర్జీదారుడి వంతయింది. ఇది కేవలం ఒడిశా సమస్య మాత్రమే కాదు.. దాదాపు 12 రాష్ట్రాల్లో ఇలాంటి దురవస్థ ఉంది. ఆర్టీఐ కింద సమాచారం అడిగితే.. వారి ముందు ఉన్న అర్జీలన్నిటినీ దాటుకుని రావాలంటే కచ్చితంగా ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ లో ఆర్టీఐ కింద అపరిష్కృతంగా ఉన్న అర్జీల సంఖ్య 2.55 లక్షలు దాటింది. సతర్క్ నాగరిక్ సంఘటన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ విషయాలను బయటపెట్టింది.

2005 అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చింది. 16ఏళ్లు గడిచినా ఇంకా సమాచారం ఇవ్వడంలో కేంద్ర కమిషన్ తోపాటు, ఆయా రాష్ట్రాల కమిషన్లు కూడా ఆశించిన స్థాయిలో పనిచేయడంలేదు. ప్రతి ఏడాదీ 40లక్షలనుంచి 60లక్షల వరకు అర్జీలు వస్తుంటాయి. కేంద్ర సమాచార కమిషన్ లో పూర్తి స్థాయిలో కమిషనర్లు లేక ఐదేళ్లవుతోంది. అప్పటినుంచి కమిషనర్ స్థాయి ఉద్యోగులు లేక సీఐసీ సతమతం అవుతోంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి.

మహారాష్ట్రలో మహా పెండింగ్..
ఉద్యోగుల కొరత వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తుతోందని చెబుతున్నారు ఉన్నతాధికారులు. అందుకే సమాచారం అడిగితే ఏడాది తర్వాతే మీ నెంబర్ వస్తుందని సర్ది చెబుతున్నారు. ఇక రాష్ట్రాలవారీగా లెక్కలు చూస్తే, మహారాష్ట్రలో అత్యథికంగా 74,240 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లో 48,514 అర్జీలు, కేంద్ర సమాచార కమిషన్ వద్ద 36,788 అర్జీలు పెండింగ్ లో ఉండటం విశేషం. ఈ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే పెండింగ్ లిస్ట్ లో ఆరో స్థానంలో తెలంగాణ, 10వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండటం ఊరటనిచ్చే విషయం. తెలంగాణలో 11,207 అర్జీలు పెండింగ్ లో ఉండగా, ఏపీలో కేవలం 5,123 దరఖాస్తులు అపరిష్కృతంగా మిగిలిపోయాయి.