మహాసముద్రం మూవీ రివ్యూ

నటీన‌టులు: శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు, అను ఇమ్మాన్యుయేల్, జ‌గ‌ప‌తిబాబు,రావు రమేష్
మ్యూజిక్‌: చైత‌న్య భ‌ర‌ద్వాజ్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
నిర్మాణం : ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్‌
నిర్మాత: సుంక‌ర్ రామ‌బ్ర‌హ్మం
మాటలు : సయ్యద్
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి
నిడివి : 155 నిమిషాలు
రేటింగ్: 2.25/5

ఈకాలం కొత్త కథలు దొరకవు. ఉన్న కథల్నే కాస్త అటుఇటు మార్చి కొత్తగా చెప్పాలి. అంటే స్క్రీన్ ప్లే
బాగుండాలన్నమాట. మహాసముద్రం విషయంలో అక్కడే తేడా కొట్టింది. ప్రేక్షకులు ఈ సినిమాలో కొత్త కథ
ఉంటుందని ఆశించారు. ఎందుకంటే మల్టీస్టారర్ కాబట్టి. అలా లేనప్పుడు కనీసం కొత్త స్క్రీన్ ప్లే అయినా
కనిపించాలి. ఈ రెండూ లోపించడంతో మహాసముద్రం ఆకట్టుకోలేకపోయింది.

ఇద్దరు స్నేహితులు. ఒకడేమో మంచి నుంచి చెడుకు మారతాడు. ఇంకొకడు చెడుతోనే సావాసం చేస్తాడు.
మంచి-చెడుతో సంబంధం లేకుండా స్నేహితుడ్ని కోరుకుంటాడు హీరో. మధ్యలో ఇద్దరు హీరోయిన్లు. ఇలా
మహాసముద్రం సినిమాను ఎమోషనల్ గా డ్రామాగా తెరకెక్కించాలనుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి.
అందుకు తగ్గట్టే మంచి సెటప్ సిద్ధం చేసుకున్నాడు. హీరోహీరోయిన్ల పాత్రలతో పాటు, క్యారెక్టర్ ఆర్టిస్టుల
పాత్రల్ని కూడా రాసుకున్నాడు. కానీ ఆసక్తికరంగా కథను చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు.

దర్శకుడు ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాడో చెప్పుకునే ముందు, మహాసముద్రం కథ ఏంటో ఓసారి చూద్దాం..

అర్జున్ (శర్వానంద్), విజయ్ (సిద్దార్థ్) ఇద్దరూ బాల్యం నుంచే మంచి స్నేహితులు. ఒకరంటే ఒకటికి ప్రాణం. అర్జున్ ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో ఉంటాడు. ఇక విజయ్ పోలీస్ ట్రైనింగ్ తీసుకొని పోలీస్ ఉద్యోగానికి పరీక్ష రాస్తాడు. ఉద్యోగం వచ్చాక తన ప్రేయసి మహా (అదితిరావు హైదరి) ని పెళ్లాడలనుకుంటాడు విజయ్. వైజాగ్ ని శాసిస్తున్న స్మగ్లర్ ధనుంజయ్(రామచంద్ర రాజు) మరణంలో అనుకోకుండా ఇరుక్కుంటాడు విజయ్. దీంతో వైజాగ్ వదిలి నాలుగేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. అయితే అప్పటికే విజయ్ ప్రేయసి గర్భవతి. ఆమెను, ఆమె కూతుర్ని అర్జున్ చేరదీస్తాడు.

నాలుగేళ్ల తర్వాత మళ్ళీ విజయ్ వైజాగ్ వస్తాడు. అలా తిరిగొచ్చిన విజయ్.. వైజాగ్ లో స్మగ్లర్ గా ఎదిగిన అర్జున్ ని చూసి షాక్ అవుతాడు. అర్జున్, మహాల సంబంధంపై అనుమానపడతాడు. అక్కడ్నుండి స్నేహితుల మధ్య వైరం ముదురుతుంది. ఆ తర్వాత ఏమైంది? అర్జున్ ఎందుకు స్మగ్లర్ గా మారాడు? అర్జున్, విజయ్ మళ్ళీ కలిశారా? విజయ్ ఉన్నఫళంగా దుర్మార్గుడిలా మారడానికి కారణం ఏమిటి అనేది బ్యాలెన్స్ స్టోరీ.

అటు ప్రేమకథను, ఇటు మాఫియా స్టోరీని కలిపి 2017-2021 మధ్య జరిగిన కథగా మహాసముద్రంను చూపించాలనుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. అతడి ఆలోచన బాగుంది. కానీ నెరేషన్ మాత్రం ఫ్లాట్ గా సాగింది. సినిమా బాగానే ఓపెన్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది అనుకుంటాం. కానీ అంతలోనే మూసలో పడిపోయాడు దర్శకుడు. వరుసగా రొటీన్ సన్నివేశాలు, ఊహించినట్టుగా సాగే స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. దీంతో ఇంటర్వెల్ కార్డుకే రొటీన్ అనే ముద్ర వేయించుకుంటుంది ఈ సినిమా.

కనీసం సెకండాఫ్ లో అయినా ట్విస్టులు ఉంటాయని భావించిన ప్రేక్షకుడికి అక్కడ కూడా నిరాశే
ఎదురౌతుంది. అక్కడ కూడా దర్శకుడు ఫ్లాట్ నెరేషన్ నే నమ్ముకున్నాడు. ఇద్దరు హీరోలు, బలమైన క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని పెట్టుకొని పేలవమైన స్క్రిప్ట్ తో సినిమాను పాడుచేశాడు. ఇంతోటిదానికా ఈ దర్శకుడు మూడేళ్లుగా ఎదురుచూశాడు అనిపిస్తుంది మహాసముద్రం చూస్తే.

వీక్ నెరేషన్ ను పక్కనపెడితే.. హీరోలిద్దరూ మెరిశారు. శర్వానంద్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇంకా చెప్పాలంటే సినిమాను నడిపించింది ఇతడే. ఇతడు కూడా చేతులెత్తేసినట్టయితే సినిమా మరీ ఘోరంగా ఉండేది. శర్వా కష్టం స్క్రీన్ పై కనిపించింది. ఇక రీఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్ నెగెటివ్ షేడ్స్ లో బాగానే మెప్పించాడు. అయితే అతడి పాత్రను దర్శకుడు రాసుకున్న విధానం అంత మెప్పించదు. ఇంకా బలంగా రాసుకుంటే బాగుండేది కానీ, పూర్తిగా విలన్ పాత్ర అయిపోతుందని దర్శకుడు భావించినట్టున్నాడు. హీరోయిన్లు ఇద్దరికీ నటించే అవకాశం ఇవ్వలేదు దర్శకుడు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో చెప్పినట్టు హీరోయిన్లను అలా దేవతలుగా చూస్తూ ఉండిపోయినట్టున్నాడు.

టెక్నికల్ గా చూస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవైపు సినిమా నీరసంగా అనిపించినప్పటికీ కదలకుండా చూసేలా చేసింది రాజ్ తోట సినిమాటోగ్రఫీ. లైటింగ్, ఆర్ట్ వర్క్ ను బాగా ఉపయోగించుకున్నాడు సినిమాటోగ్రాఫర్. ఎడిటింగ్ బాగాలేదు. చైతన్ భరధ్వాజ్ పాటలు బాగాలేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ ఓకే. సయ్యద్ అందించిన మాటలు బాగున్నాయి. అజయ్ భూపతి దర్శకుడిగా సక్సెస్ అయినా, నెరేషన్ (స్క్రీన్ ప్లే) విషయంలో ఫెయిల్ అయ్యాడు.

ఓవరల్ గా భారీ అంచనాలతో వచ్చిన మహాసముద్రం సినిమా ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. హై-పాయింట్స్ లేకుండా ఫ్లాట్ గా సాగిన కథనం ఈ సినిమాను సముద్రం పాలుచేసింది.