చిరంజీవి చేతికి సర్జరీ

కరోనా టైమ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటుచేసి సేవలందించారు చిరంజీవి. ఈ క్రమంలో తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వాళ్లను ప్రత్యేకంగా
అభినందించారు. అయితే ఈ కార్యక్రమానికి చేతికి బ్యాండేజ్ తో హాజరయ్యారు చిరు. దీంతో అంతా ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తన అరచేతికి చిన్నపాటి సర్జరీ అయిందనే విషయాన్ని చిరంజీవి వెల్లడించారు. కుడి చేతితో ఏ పని చేయాలన్నా కొంచెం నొప్పిగా, తిమ్మిరి ఏర్పడుతున్నట్టు అనిపించడంతో డాక్టర్ ను సంప్రదించానని వెల్లడించారు. కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్ అనే నరం మీద ఒత్తిడి పడుతున్నట్టు వైద్యులు గుర్తించారట.

ఈ మేరకు అపోలో ఆసుపత్రిలో కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చిరంజీవి చేతికి సర్జరీ
చేశారు. 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, ఒత్తిడి తగ్గించారని మెగాస్టార్ పేర్కొన్నారు. ఈ సర్జరీ జరిగిన 15 రోజుల తర్వాత కుడి చేయి మళ్లీ యధావిధిగా పని చేస్తుందని తెలిపారు.

ఈ సర్జరీ వల్ల చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ వాయిదా పడింది. నవంబర్ ఒకటి నుంచి తిరిగి గాడ్ ఫాదర్ షూట్ లో జాయిన్ అవుతారు చిరు. అన్నట్టు ఈ సర్జరీ నిర్వహించిన సుధాకర్ రెడ్డి.. స్వయానా దర్శకుడు విజయ బాపినీడుకు అల్లుడు.