షూటింగ్ మొదలుపెట్టకముందే 35 కోట్లు

సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఎప్పట్నుంచి షూటింగ్ మొదలవుతుందనే క్లారిటీ కూడా లేదు. అంతలోనే 2 కీలకమైన బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ సినిమాకు సంబంధించిన మేటర్ ఇది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది. అలాగే మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ రెండు డీల్స్ మొత్తం ఖరీదు 35 కోట్ల రూపాయలు.

మరోవైపు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పై దర్శకుడు హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. నవంబర్ లేదా డిసెంబర్ నుంచి సినిమా తప్పకుండా సెట్స్ పైకి వస్తుందంటున్నాడు. హరీష్ సినిమాల్లో వరుసగా కనిపిస్తూ వస్తున్న పూజాహెగ్డే, ఈ సినిమాలో కూడా నటించనుంది. తొలిసారి పవన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించే పనిలో ఉన్నాడు.