పట్టాభి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళన..

సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఏపీలో గంజాయి అక్రమ రవాణాకు, సీఎం జగన్ కి సంబంధం ఉన్నట్టు పట్టాభి మాట్లాడటంతోపాటు.. కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో వైసీపి శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై, అటు పట్టాభి ఇంటిపై కూడా దాడి జరిగింది. వైసీపీ నేతలు, కార్యకర్తలే ఈ దాడి చేశారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. హిందూపురంలో బాలకృష్ణ కార్యాలయం వద్ద కూడా వైసీపీ శ్రేణులు, టీడీపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశాయి.

గంటల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ శ్రేణులు ఆందోళనలు మొదలు పెట్టాయి. టీడీపీ ఆఫీస్ ల వద్ద నిరసన తెలియజేసేందుకు కార్యకర్తలు వెళ్తున్న క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తరలించారు. వీరికి పోటీగా మరోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పార్టీ ఆఫీస్ ల వద్దకు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఎక్కడికక్కడ ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు.

మంగళగిరిలో పార్టీ ఆఫీస్ పై దాడి జరిగిన అంతరం చంద్రబాబు వెంటనే అక్కడికి చేరుకున్నారు. దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, అశోక్‌ బాబు, పట్టాభి తదితరులు పార్టీ కార్యాలయానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ చంద్రబాబు, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ కు ఫోన్ లో ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడిన చంద్రబాబు కేంద్ర బలగాలను పంపాలని కోరినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.