ఆర్ఆర్ఆర్ తో బంగార్రాజు పోటీ

రీసెంట్ గా స్టార్ట్ అయింది బంగార్రాజు సినిమా. కథ ప్రకారం సినిమాలో సీజీ వర్క్ ఎక్కువగా ఉంది. పైగా
మల్టీస్టారర్, ఇద్దరు హీరోయిన్లతో తీయాల్సిన సినిమా. కాబట్టి కనీసం 5 నెలలైనా టైమ్ పడుతుంది. కానీ
నాగార్జున మాత్రం అస్సలు తగ్గట్లేదు, మరో 2 నెలల్లో సినిమాను రెడీ చేసి సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేస్తాం అంటున్నాడు.

సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా వస్తోంది బంగార్రాజు ప్రాజెక్టు. ఆ సినిమా సంక్రాంతికొచ్చి పెద్ద
హిట్టయింది. ఆ సెంటిమెంట్ తో బంగార్రాజును కూడా సంక్రాంతికి తీసుకురావాలనేది నాగ్ ప్లాన్. కానీ ఉన్న ఈ 2 నెలల్లో సినిమా రెడీ అవుతుందా అనేది ఓ డౌట్ అయితే, మరో పెద్ద డౌట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పోటీ.

సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ లాక్ అయింది. ఇది వస్తుందని తెలిసిన వెంటనే సర్కారువారి పాట సినిమాను పోస్ట్ పోన్ చేశారు. పైకి చెప్పకపోయినా భీమ్లా నాయక్ కూడా పోటీ నుంచి తప్పుకుంది. ఇలా పవన్ కల్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలే తప్పుకుంటున్న టైమ్ లో, నాగ్ మాత్రం పోటీకి సై అంటున్నాడు.

కేవలం తన సినిమా బిజినెస్ కోసం నాగ్ ఇలా పైకి సంక్రాంతి రిలీజ్ అని చెబుతున్నాడా.. లేక నిజంగానే
అన్నంత పని చేస్తాడా అనేది చూడాలి. నాగ్-నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు కల్యాణ్ కృష్ణ
దర్శకుడు. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లు.