టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏపీలో పోటా పోటీగా దీక్షలు..

టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన ఆందోళనలు, నిరసన ప్రదర్శనలతో మంగళవారం సాయంత్రం నుంచి ఏపీలో పొలిటికల్ వాతావరణం బాగా హీటెక్కింది. దీనికి కొనసాగింపుగా టీడీపీ, వైసీపీ ఇప్పుడు పోటాపోటీగా దీక్షలకు పిలుపునిచ్చాయి. అటు మంగళగిరిలో ధ్వంసమైన పార్టీ కార్యాలయంలో చంద్రబాబు 36గంటలపాటు నిరసన దీక్ష చేపడుతున్నారు. దీనికి పోటీగా ఏపీలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 2 రోజులపాటు వైసీపీ జనాగ్రహ దీక్షలు చేపడుతోంది. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగే ఈ దీక్షల్లో.. ఎంపీటీసీ, జడ్పీటీసీలు.. ఇతర నాయకులు పాల్గొంటారు. బూతు వ్యాఖ్య‌ల‌కు చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాల‌నే డిమాండ్‌తో జ‌నాగ్ర‌హ దీక్ష‌లు చేస్తున్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

దీక్షతోపాటు లేఖాస్త్రాలు..
36 గంటల దీక్షతో ఏపీలో జరుగుతున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తామని అంటున్న చంద్రబాబు.. మరోవైపు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి వరుసగా లేఖాస్త్రాలు సంధించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. రాష్ట్రంలోని విపక్ష నేతలకు, కార్యాలయాలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులు, గంజాయి, డ్రగ్స్‌ రవాణాకు సంబంధించిన పలు అంశాలను ఈలేఖల్లో ఆయన వివరించారు. దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్పింగులు కూడా కేంద్రానికి పంపించారని తెలుస్తోంది.

పట్టాభి అరెస్ట్..
మరోవైపు సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పట్టాభిని పోలీసులు రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన్ను తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. సెక్షన్ 153-ఎ, 505-2, 353, 504 రెడ్ విత్ 120-బి కింద పట్టాభిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ఆయన భార్యకి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. పట్టాభి అరెస్ట్ ను టీడీపీ ఖండించింది. పట్టాభి ఇంటిపై దాడి జరిగిందని, ఆయన బాధితుడు అని, బాధితుడిని పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు నారా లోకేష్. మొత్తమ్మీద టీడీపీ, వైసీపీ పోటాపోటీ దీక్షలతో.. మరో రెండు రోజులపాటు ఏపీలో రాజకీయ రచ్చ కొనసాగేలా ఉంది.