రాధేశ్యామ్ తప్ప అంతా నిరాశపరిచారు

ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు. మరీ ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రభాస్ వరుసపెట్టి సినిమాలు
చేస్తున్నాడు. దీంతో రెబల్ స్టార్ అభిమానులు ఈరోజుపై చాలా ఆశలు పెట్టుకున్నారు. వరుసగా ఫస్ట్ లుక్స్, టీజర్లు వస్తాయని ఊహించుకున్నారు. కానీ వాళ్ల ఆశలు అడియాశలయ్యాయి. రాధేశ్యామ్ మినహా ఇతర సినిమాల నుంచి ఎలాంటి హంగామా లేదు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా నుంచి కేవలం శుభాకాంక్షలు మాత్రమే చెప్పారు. ఎలాంటి కొత్త పోస్టర్, టీజర్ లేదు. మరోవైపు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చేస్తున్నాడు. వాళ్లు కూడా కేవలం శుభాకాంక్షలు చెప్పి చేతులు దులుపుకున్నారు. అటు త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ప్రాజెక్ట్-కె నుంచి కూడా ఎలాంటి హంగామా లేదు.

ఇలా ప్రభాస్ పుట్టినరోజు నాడు రాధేశ్యామ్ టీజర్ మినహా, ఇతర హంగామా ఏదీ లేకపోవడంతో అతడి
అభిమానులు నిరాశచెందారు. కనీసం కొత్త స్టిల్స్ రిలీజ్ చేసినా బాగుండేదని, అస్సలు సందడి
చేయకపోవడం నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.