నేను విశ్వాసఘాతుకుడినే.. మరి నువ్వేంటి? చంద్రబాబుపై వంశీ ఘాటు వ్యాఖ్యలు..!

ఎప్పుడైతే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం దూషించుకుంటున్నారు. రోజులు గడుస్తున్నా ఆ వేడి మాత్రం ఇంకా చల్లారడం లేదు. జగన్ పై పట్టాభి వ్యాఖ్యలు తర్వాత వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం.. ఆ తర్వాత టీడీపీ నిరసనలు తెలుపుతుండటంతో రాజకీయం వేడెక్కింది.

ఇక ఆయా పార్టీల్లోని నేతలు కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మంత్రి కొడాలినాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దారుణమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఇరు పక్షాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి.

కాగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపట్టాయి. అతడు విశ్వాసఘాతకుడంటూ విమర్శలు చేశాయి. ఈ మేరకు టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. దీనిపై తాజాగా వల్లభనేని స్పందించారు. ఓ ట్వీట్ చేశారు.

‘నేను విశ్వాసఘాతుకుడినే. అది నీ ఒక్కడికి మాత్రమే.. కానీ నువ్వు..ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, హరికృష్ణ, మోదీ, అమిత్‌షా లాంటి పెద్దలకు నమ్మకద్రోహివి, వెన్నుపోటుదారుడివి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన పార్టీలకు కూడా నమ్మకద్రోహివి. వెన్నుపోట్లు.. నమ్మకద్రోహాలకు, విశ్వాసఘాతుకాలకు నిఖార్సైన పేటెంట్ నీదే’ అంటూ వల్లభనేని వంశీ విమర్శించారు.

‘నేను కేసీఆర్‌కు పొర్లు దండాలు పెడితే.. ఓటుకు నోటు కేసులో మరి నువ్వు చేస్తున్నదేంటి చంద్రబాబు’ అంటూ ట్విట్టర్ వేదికగా వంశీ మండిపడ్డారు. వంశీ తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.