డోసు డోసుకీ వ్యత్యాసం.. 100కోట్లు వేసి ఏంటి ప్రయోజనం..?

భారత్ లో 100కోట్ల టీకా డోసులు పంపిణీ చేశామంటూ జబ్బలు చరుచుకుంటోంది కేంద్రం. అయితే ఫస్ట్ డోస్ కి, సెకండ్ డోస్ కి మధ్య ఉన్న వ్యత్యాసం మాత్రం కలవరపెడుతోంది. సరైన ప్రణాళిక లేకపోవడంతో భారత్ లో కొవిడ్ టీకా పంపిణీ 100కోట్ల మైలురాయిని చేరుకున్నా.. ఫస్ట్ డోస్ తీసుకున్నవారి సంఖ్య, సెకండ్ డోస్ తీసుకున్నవారి సంఖ్యకి మద్య ఉన్న తేడా సమర్థనీయం కాదని అంటున్నారు నిపుణులు.

బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం చైనా జనాభాలో ఫస్ట్ డోస్ తీసుకున్నవారు 82శాతం మంది ఉండగా.. సెకండ్ డోస్ కూడా తీసుకున్నవారు 76శాతం మంది ఉన్నారు. అక్కడ రెండు డోసుల మధ్య గ్యాప్ కేవలం 1.1 శాతం. అమెరికాలో 66.2 శాతం మంది ఫస్ట్ డోస్ తీసుకోగా.. 57.3 శాతం మందికి రెండు డోసులు అందాయి. అక్కడ డోసుల మధ్య గ్యాప్ 1.15 శాతంగా ఉంది. ఇక యూరప్ లో కూడా ఈ వ్యత్యాసం చాలా తక్కువ. కేవలం 1.04 శాతం మాత్రమే. కానీ భారత్ లో రెండు డోసుల మధ్య గ్యాప్ చాలా ఎక్కువ. మనదేశంలో అర్హులైన జనాభాలో ఇప్పటి వరకూ 51శాతం మందికి ఫస్ట్ డోస్ వేయగలిగారు. 21.9 శాతం మంది మాత్రమే రెండు డోసుల టీకా తీసుకున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం పంపిణీ అయిన 100 కోట్ల డోసుల్లో 40కోట్ల మంది ఫస్ట్ డోస్ తీసుకోగా.. కేవలం 30కోట్లమంది మాత్రమే రెండు డోసులు తీసుకున్నారు. అంటే కేంద్రం చెప్పుకుంటున్నట్టు 100కోట్ల మైలురాయి అనేది పెద్దదే అయినా.. భారత్ లో కేవలం 30కోట్ల మందికి మాత్రమే రెండు డోసుల టీకా అందింది అనే గణాంకాలు మాత్రం కలవరపెడుతున్నాయి. రెండు డోసుల మధ్య తేడా భారత్ లో 2.4 శాతంగా ఉండటం విశేషం. రెండు డోసులు తీసుకున్నవారిలో మాత్రమే పూర్తి స్థాయిలో యాంటీబాడీలు ఉత్పన్నం అవుతాయని పరిశోధనలు చెబుతుండగా.. భారత ప్రభుత్వం కేవలం గణాంకాలకోసం పరిగెడుతున్నట్టు అనిపిస్తోంది.

పరుగులుపెట్టిస్తున్న కేంద్రం..
100కోట్ల మైలురాయి చేరుకున్న సందర్భంలో ఈ లెక్కలన్నీ బయటకు రావడంతో కేంద్రం హడావిడి పడుతోంది. సెకండ్ డోస్ టీకాకు అధిక ప్రాధాన్యమివ్వాలని, ఫస్ట్ డోస్ తీసుకున్నవారికి వెంటనే రెండో డోసు కూడా పూర్తి చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఇకపై పంపిణీ చేసే టీకాల్లో సెకండ్ డోస్ ఎక్కువగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచాలని సూచించారు.

మనదేశంలోనే గ్యాప్ ఎందుకు ఎక్కువ..?
భారత్ లో కొవిషీల్డ్, కొవాక్సిన్ రెండూ పంపిణీ అవుతున్నా.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత వ్యాక్సిన్ లో దాదాపు 88శాతం కొవిషీల్డ్ ఉంటోంది. ఈ టీకా డోసుల మధ్య గ్యాప్ ని ఇటీవల భారీగా పెంచారు. ఏకంగా 12 నుంచి 16 వారాల గ్యాప్ ఇచ్చారు. ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్త ఉత్పాదన అయిన ఈ టీకాను నెలరోజుల గ్యాప్ లో ఇతర దేశాలు రెండు డోసులు పంపిణీ చేస్తున్నారు. భారత్ లో మాత్రం గ్యాప్ ఎక్కువగా ఉంది. దీంతో ఇక్కడ డోసులు పంపిణీ అయ్యాయే కానీ.. దాని వల్ల కలిగిన ప్రయోజనం ఎంత అనేది ప్రశ్నార్థకంగా మారింది. భారత్ లో 100 కోట్ల డోసులు పంపిణీ చేశారు కానీ కేవలం 30కోట్ల మందికి మాత్రమే పూర్తి స్థాయిలో టీకా అందింది అనేది మాత్రం వాస్తవం.