కరోనా టీకా తీసుకోకపోతే రేషన్, పెన్షన్ నిలిపివేత..!

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు పోటీలు పడ్డారు. టీకా కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గి కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో కరోనా భయం తగ్గిపోయింది. ప్రస్తుతం టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి టీకా వేసుకోవాలని కోరుతున్నప్పటికీ.. ప్రజలు మాత్రం వేయించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.

ఇదిలా ఉండగా రష్యాలో ప్రస్తుతం రోజుకు సుమారు 40 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక చైనాలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. మన దేశంలో కూడా కేరళ, మధ్యప్రదేశ్ లో కరోనా వ్యాప్తి అధికమైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో తాజాగా ఏవై.4 అనే కొత్త వేరియంట్ ఆరుగురికి సోకడం కలకలం రేపుతోంది.

మరోవైపు కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదని ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే కరోనా టీకా తీసుకోరో వారికి ఇకపైన పెన్షన్, రేషన్ పంపిణీ నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.

దీనిపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని వారికి పెన్షన్, రేషన్ పంపిణీ నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని తెలిపారు. కరోనా మూడో దశ రాకుండా ఆపాలంటే వ్యాక్సినేషన్ ఎంతో ముఖ్యమని..ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.