విశాఖ పరిపాలనా రాజధాని.. గుర్తించిన ఇండియన్ నేవీ..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది..అంటే ఎవరూ కచ్చితమైన సమాధానం చెప్పలేరు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడి నుంచే పాలన కొనసాగించింది. పలు ప్రభుత్వ కార్యాలయాలను కూడా నిర్మించింది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని మార్పు పై కీలక ప్రకటన చేసింది. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలంటూ సీఎం జగన్ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయని సీఎం జగన్ ప్రకటించారు.

ఈ మేరకు ఉభయ సభల్లోనూ బిల్లులు కూడా ప్రవేశపెట్టారు. అయితే మూడు రాజధానులకు వ్యతిరేకంగా పలువురు కేసులు వేయడంతో ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. దీంతో ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం అమరావతి నుంచి ప్రభుత్వ పరమైన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు అమరావతే రాజధానిగా కొనసాగించాలంటూ టీడీపీ సహా అమరావతి రైతు పరిరక్షణ సమితి, జేఏసీ ఉద్యమాలు చేస్తున్నాయి.

ఇండియన్ నేవీ తాజాగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా గుర్తించింది. ఈ మేరకు సీఎం జగన్‌కు ఓ ఆహ్వానలేఖ పంపింది. ‘రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా గుర్తించిన తర్వాత యుద్ధ నౌకకు విశాఖపట్నం పేరు పెట్టాం’ అంటూ ఇండియన్ నేవి పేర్కొన్నది.

డిసెంబర్ 4న విశాఖపట్నంలో జరిగే నేవీ వేడుకలకు రావాలని సీఎం జగన్‌ను నేవీ అధికారులు ఆహ్వానించారు. ఈ మేరకు రూపొందించిన ఆహ్వాన పత్రికలో విశాఖను పరిపాలనా రాజధానిగా గుర్తించారు. విశాఖపట్నంలో వచ్చేనెల 4వ తేదీన జరగనున్న నేవీ డే వేడుకలకు రావాలని సీఎం జగన్‌ను తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌సింగ్‌ ఆహ్వానించారు. ఆయన సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.

కాగా ఇండియన్ నేవీ విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా గుర్తించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉన్నా కూడా ఇండియన్ నేవీ విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా గుర్తించడంతో పాటు యుద్ధ నౌకకు విశాఖ పేరు పెట్టడం కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది.