మిరప తోటలో గంజాయి మొక్క..

తులసి వనంలో గంజాయి మొక్క అనేది నానుడి. వాస్తవానికి తులసి వనంలో గంజాయి బతుకుతుందో లేదో తెలియదు కానీ.. 100మంది మంచి వారి మధ్య ఒక చెడ్డ వ్యక్తి ఉన్నా కూడా వాడి లక్షణాలు మారవు అని చెప్పడానికి ఈ నానుడి ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు మిరపతోటలో గంజాయి మొక్క అనేది మాత్రం వాస్తవం అంటున్నారు పోలీసులు. ఇన్నాళ్లూ గంజాయిని అటవీ ప్రాంతాల్లో ఎవరి కంటా పడకుండా పెంచుతారని పోలీసులు అనుకునేవారు. కానీ ఇప్పుడది మిరపతోటలో అంతర పంట అనే నిజాన్ని తెలుసుకుని విస్తుపోయారు.

ఇటీవల విశాఖ, గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయికోసం దాడులు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. గంజాయిలో కూడా రకరకాలు ఉంటాయని, అందులో శీలావతి అనే రకానికి మంచి డిమాండ్ ఉందని, అది ఏపీ నుంచే ఎక్కవగా ఎగుమతి అవుతుందనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. తాజాగా.. మిరప తోటలో గంజాయి అంతర పంటగా సాగు చేస్తున్నట్టు నిర్థారించారు.

సీలేరు నదీ పరివాహక ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఆధ్వ‌ర్యంలో ఇటీవల గంజాయిని పట్టుకునేందుకు స్పెషల్ డ్రైవ్ జరిగింది. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో భారీగా మిరప పంట సాగు చేయడాన్ని గమనించారు పోలీసులు. ఏజెన్సీ ఏరియాల్లో మిరప తోటలు సహజమే అయినా లోతుగా పరిశోధిస్తే.. అందులో గంజాయి అంతర పంటగా వేశారనే విషయం నిర్థారణ అయింది. దీంతో మిరప తోటని అలానే ఉంచి, లోపల ఉన్న గంజాయిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో మిరపతోటల సాగుపై ఇప్పటి వరకూ తాము దృష్టిపెట్టలేదని, ఇకపై క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెబుతున్నారు పోలీసులు.

మిరపతోట అనుకూలం..
మిరప మొక్కలు, గంజాయి మొక్కలు దాదాపుగా ఒకే ఎత్తు వరకు పెరుగుతాయి. చుట్టూ మిరపతోట వేసి, మధ్యలో గంజాయి సాగు చేస్తే ఎవరికీ అనుమానం రాదు. దూరం నుంచి చూస్తే అసలు ఆనవాళ్లే కనిపించవు. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మిరప మాటున గంజాయి సాగు చేస్తున్నట్టు పోలీసులు నిర్థారించారు. మిరప తోటలపై నిఘా పెంచారు.