తీరం దాటిన వాయుగుండం..!

బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 9 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ విధించిన సంగతి తెలిసిందే. అత్యవసర పనులుంటే మాత్రమే ప్రజలు బయటకు రావాలని.. లేదంటే ఇల్లు విడిచి బయటకు రావద్దని ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి చెన్నై కి సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వాయుగుండం భూభాగం పైకి వచ్చిన తర్వాత క్రమంగా బలహీనపడుతుందని వారు చెప్పారు. దీని ప్రభావం కారణంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు,చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, కడప, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

తిరుమల ఘాట్ రోడ్డు మూసివేత
తుఫాను కారణంగా తిరుపతి, తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి బస్టాండ్, రైల్వే బ్రిడ్జి నీట మునిగాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరాయి. వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

తిరుమలలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు కొండపైకి వాహనాల రాకపోకలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 6 గంటలకు తిరిగి వాహనాల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. అలాగే తిరుమల, అలిపిరి ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి.