మార్పు మాటల్లో కాదు.. చేతల్లో..

పేద, నిరుపేద విద్యార్థులు చదువుకునే సామాజిక హాస్టల్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ప్రస్తుతం నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలల్లో వసతులు మెరుగు పరుస్తోంది ప్రభుత్వం. అదే సమయంలో సామాజిక హాస్టల్స్ విషయంలో కూడా చొరవ చూపేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఓ అడుగు ముందుకు వేశారు. గతంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నిర్వహణలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయం సత్ఫలితాలనిచ్చింది. అదే నిర్ణయాన్ని ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడా అమలు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు.

కృష్ణా జిల్లాలో మొత్తం 150 సామాజిక విద్యార్థి వసతి గృహాలున్నాయి. వీటన్నిటిపై అధికారుల ఉమ్మడి పర్యవేక్షణ ఉన్నా కూడా.. వ్యక్తిగతంగా ఒక్కొకరికి ఒక్కో హాస్టల్ బాధ్యత అప్పగించేలా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని పంచాయతి రాజ్, ఆర్.డబ్ల్యు.ఎస్., సమగ్ర శిక్ష అభియాన్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్లనుంచి ఇంజినీర్లతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఒక్కో ఇంజినీర్ ఒక్కో హాస్టల్ పర్యవేక్షణకు ముందుకు రావాలని సూచించారు. వ్యక్తిగతంగా ఒక్కో హాస్టల్ పర్యవేక్షణ, ఒక్కో అధికారికి బాధ్యత అప్పగిస్తే.. కచ్చితంగా హాస్టల్స్ రూపు రేఖలు మారిపోతాయనేది ఆయన ఆలోచన. దానికి సంబంధించిన నిధుల విడుదలకు తక్షణం తాను చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు కలెక్టర్.

150మంది ఇంజినీర్లు, 150 హాస్టళ్లు, 6నెలల గడువు.. ఈలోగా సామాజిక హాస్టల్స్ లో వసతి, మరుగుదొడ్ల నిర్వహణలో కచ్చితంగా మార్పు తీసుకు రావాలని సూచించారు కలెక్టర్. అక్కడితో ఆపేయకుండా.. ఆయా హాస్టల్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా అక్కడి వ్యవహారాలను పర్యవేక్షించాలని, ఒకరకంగా వాటిని దత్తత తీసుకుని వాటి బాగోగులు చూసుకోవాలని చెప్పారు. గతంలో శ్రీకాకుళం జిల్లాలో తాను చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చినట్టే.. కృష్ణా జిల్లాలో కూడా దీన్ని అమలు చేయాలని కోరారు.

అన్ని జిల్లాల్లోనూ ఇదే జరిగితే..
ప్రభుత్వం దగ్గర నిధులున్నాయి, సమర్థులైన అధికారులున్నారు.. కానీ కొన్ని చోట్ల చిన్న పర్యవేక్షణ లోపంతో కొన్ని పథకాలు నీరుగారిపోయే అవకాశముంది. అయితే పథకాల అమలుని ఇలా వ్యక్తిగతంగా అప్పగిస్తే కచ్చితంగా మార్పు సాధ్యం. శ్రీకాకుళంలో ఈ మార్పు సాధ్యమైంది, కృష్ణాలో దీనికి తొలి అడుగు పడింది. ఇదే రీతిలో.. ఇతర జిల్లాల్లో కూడా దీనిపై అధ్యయనం జరిగితే నిరుపేదల హాస్టల్స్.. నిజంగానే విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతాయి.