నోరో వైరస్ కలకలం.. కేరళ ప్రభుత్వం అప్రమత్తం..

కేరళ వయనాడ్ జిల్లాలోని వెటర్నరీ కాలేజీ విద్యార్థులు నోరో వైరస్ బారినపడటం కలకలం రేపింది. ప్రభుత్వం దీనిపై వెంటనే అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే నోరో వైరస్ కేవలం డయేరియా లాంటి వ్యాధేనని, వాంతులు, విరేచనాలు, నీరసం.. దీని లక్షణాలు అని.. కలుషిత ఆహారం, నీటి వల్ల మాత్రమే ఇది వ్యాపిస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

కరోనా తర్వాత అంతా గందరగోళం..
కరోనా తర్వాత ఎక్కడ ఏ చిన్నపాటి వ్యాధికారక లక్షణాలు కనిపించినా ప్రజలు హడలిపోతున్నారు. అందులోనూ నోరో వైరస్ అనేది ప్రజలకు ఎక్కువగా పరిచయం లేని పేరు కావడంతో కేరళలో ఏదో కొత్త వ్యాధి ప్రబలిందనే ప్రచారం ఎక్కువైంది. వయనాడ్ జిల్లాలోని వెటర్నరీ కాలేజీ విద్యార్థుల్లో 13మంది రెండు వారాల క్రితం ఈ నోరో వైరస్ తో ఇబ్బంది పడ్డారు. కాలేజీ హాస్టల్ కాకుండా, బయట హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు ఒకేసారి వాంతులు, విరేచనాలు కావడంతో కాలేజీ సిబ్బంది కంగారు పడ్డారు. వారికి ప్రాథమిక వైద్యం చేయించడంతోపాటు.. అలప్పుజ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి శాంపిల్స్ పంపించి టెస్ట్ చేయించారు. దీనికి కారణం నోరో వైరస్ అని నిర్థారణ అయింది. ప్రస్తుతం ఆ 13మంది విద్యార్థులు మినహా ఇంకెవరిలోనూ ఆ లక్షణాలు కనిపించలేదు. కొత్తగా ఎవరూ నోరో వైరస్ బారిన పడినట్టు ఆధారాలు లేవు.

అయితే కేరళలో కొత్త వైరస్ అంటూ పుకార్లు మొదలవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.. అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వయనాడ్ లో పరిస్థితి సమీక్షించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆహారం, తాగునీరు విషయంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు.