అటు స్టాలిన్, ఇటు కేసీఆర్.. ఇద్దరూ దూరం..

తిరుపతిలో జరగబోతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశానికి దాదాపుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావాల్సి ఉంది. వారితోపాటు అధికారులు కూడా వస్తారు. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి లెఫ్ట్ నెంట్ గవర్నర్లు హాజరవుతారు. అయితే ఈ దఫా జరిగే సమావేశానికి ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్, అటు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. అమిత్ షా ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి హాజరు కాకూడదని వారు నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది.

ఇటీవలే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అధికార పార్టీ అయిఉండి కూడా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లెక్కి నిరసన తెలిపింది టీఆర్ఎస్. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు సీఎం కేసీఆర్. పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు వ్యవహారం కూడా టీఆర్ఎస్, బీజేపీ మధ్య చిచ్చు పెట్టింది. అటు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కూడా కేసీఆర్ ని కుదురుగా ఉంచడంలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జరిగే ఈ సమావేశానికి కేసీఆర్ రాకూడదని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ప్రతినిధిగా ఆ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ హాజరవుతారు.

స్టాలిన్ కూడా ఉద్దేశపూర్వకంగానే..?
తమిళనాడులో ఇటీవల భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఐదు రోజులుగా సీఎం స్టాలిన్ జనంలోనే ఉంటున్నారు. నేరుగా వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం వర్షాల ప్రభావం తగ్గినా ఆయన మీటింగ్ కి మాత్రం దూరంగా ఉండాలనుకోవడం చర్చనీయాంశమైంది. తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో పర్యటన ఉందని, అందుకే మీటింగ్ కి రాలేకపోతున్నట్టు స్టాలిన్ సమాచారం అందించారు. అటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజన్ కూడా ఈ మీటింగ్ కి రావట్లేదు. కేరళ నుంచి ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి, చీఫ్ సెక్రటరీ హాజరవుతారని తెలుస్తోంది.