డిసెంబర్ నాటికి ఏపీలో గంజాయి సాగు కనుమరుగు..

డిసెంబర్ నాటికల్లా ఏపీలో గంజాయి సాగు లేకుండా చేస్తామని చెప్పారు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్. ఇప్పటికే సగం పని పూర్తయిందని మిగతా సగం పనిని డిసెంబర్ రెండోవారం లోగా పూర్తి చేస్తామన్నారు. సీఎం జగన్ ఆదేశాలతో అక్టోబర్ 21 నుంచి గంజాయి పంటని అరికట్టేందుకు దాడులు ముమ్మరం చేశారు అధికారులు.

అక్టోబర్ 21 తర్వాత గంజాయి తోటలపై స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారుల దాడులు మొదలయ్యాయి. విశాఖ ఏజెన్సీ సహా.. ఇతర ప్రాంతాల్లో పోలీసుల సహాయంతో తోటలను ధ్వంసం చేస్తున్నారు. రోజుకి సగటున 100 ఎకరాల తోటల్ని నాశనం చేస్తున్నారు సెబ్ సిబ్బంది. ఇప్పటి వరకూ 2400 ఎకరాల్లో గంజాయి మొక్కల్ని తగలబెట్టారు. జీపీఎస్ ద్వారా ఏజెన్సీ ఏరియాల్లో దాదాపు 5వేల ఎకరాల్లో గంజాయి పండిస్తున్నట్టు సెబ్ అధికారుల వద్ద ఆధారాలున్నాయి.

విశాఖ ఏజెన్సీలోని గూడెం కొత్తవీధి మండలంలో తొలుత రైతులతో మాట్లాడి స్వచ్ఛందంగా పంటలు తొలగించారు. ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో అకస్మాత్తుగా దాడులు నిర్వహించి పంటను ధ్వంసం చేస్తున్నారు. అయితే సెబ్ దాడులతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. గంజాయి సాగు చట్ట వ్యతిరేకం అని తెలిసినా.. తమకు కూడు పెట్టేది అదేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీకే వీధి మండలం రైతులు. తమ పిల్లల చదువులు కూడా దానిపైనే ఆధారపడి ఉన్నాయని అంటున్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. పరివర్తన పథకం ద్వారా ఇతర పంటలు పండించడానికి ఆర్థిక భరోసా ఇస్తామంటోంది.

సెకండ్ ఫేజ్ లో స్మగ్లర్ల భరతం..
ప్రస్తుతం గంజాయి పంట సాగుని ధ్వంసం చేయడం, పంట పండించకుండా నియంత్రణ విధించడంపై దృష్టిపెట్టామని చెబుతున్నారు అధికారులు. రెండో దశలో గంజాయి అక్రమ రవాణా చేసేవారి భరతం పడతామన్నారు. ఇప్పటికే కొత్త పంట లేక, పాత స్టాక్ నే రవాణా చేస్తున్నారని, అలాంటి వారికి ఇక గంజాయి దొరక్కుండా చూస్తామని అంటున్నారు. డిసెంబర్ 15నాటికి ఏపీలో గంజాయి సాగు లేకుండా చేస్తామంటున్నారు అధికారులు.