కరోనా ఆఫ్టర్ ఎఫెక్ట్స్: నిర్మాణ ఖర్చు తడిసిమోపెడు..

కరోనా తర్వాత సామాజికంగా చాలా మార్పులొచ్చాయి. కొన్ని పనులు సులభంగా మారాయి, మరికొన్ని భారమయ్యాయి. ముఖ్యంగా నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగిపోవడంతో మధ్యతరగతి కుదేలవుతోంది. అదే సమయంలో నిర్మాణ సామగ్రి రేట్లు కూడా ఇటీవల కాలంలో ఎప్పుడూలేనంతగా పెరుగుతూ పోతున్నాయి. దీంతో నిర్మాణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. మొత్తంగా 35 శాతం నుంచి 40శాతం వరకు నిర్మాణ వ్యయం పెరిగిందని చెబుతున్నారు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI) ప్రతినిధులు.

6 నెలల క్రితం ఒక టన్ను స్టీలు 46వేల రూపాయలనుంచి 48 వేల రూపాయల వరకు ఉండేది. ఇప్పుడది 69వేల నుంచి 72 వేలకు చేరుకుంది. ఇసుక రేటు టన్ను 1100 రూపాయలకు ఎగబాకింది. 280-330 రూపాయల మధ్య పలికిన సిమెంట్ బస్తా రేటు ఇప్పుడు 400-450 రూపాయలకు పెరిగింది. ఇవన్నీ కలిపి నిర్మాణ ఖర్చుని భారంగా మార్చాయి. సగటున చదరపు అడుగు నిర్మాణ వ్యయం 1000 రూపాయలనుంచి 1300 వరకు ఉండగా, ఇప్పుడది 1700 నుంచి 2వేల రూపాయలకు చేరుకుంది. కరోనా తర్వాత వలస కూలీల కొరత ఏర్పడింది. కూలీ రేట్లు కూడా భారీగా పెరిగాయి. దీంతో మొత్తం కలసి నిర్మాణ వ్యయాన్ని 40శాతం వరకు పెంచేశాయి.

ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా పుంజుకుంది. ఎక్కడికక్కడ కొత్త కొత్త ఫ్లాట్లు, వెంచర్లు మొదలవుతున్నాయి. అయితే ఇదంతా డిమాండ్ ప్రకారం జరగడంలేదని, కృత్రిమ ఎదుగుదల అని అంటున్నారు నిపుణులు. కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎక్కువమంది పెట్టుబడి మార్గంగా ఎంచుకోవడంతో ఇలాంటి మార్పు వచ్చిందని చెబుతున్నారు. అయితే స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినంత వేగంగా నిర్మాణాలు మాత్రం మొదలు కావడంలేదు. నిర్మాణ ఖర్చులు తడిసిమోపెడవడంతో.. ఇప్పటికే చాలా చోట్ల ముందస్తు ఒప్పందాల ప్రకారం పనులు సాగడంలేదని తెలుస్తోంది. అప్పటికే అగ్రిమెంట్లు పూర్తయిన నిర్మాణాల విషయంలో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. సొంత ఇంటి నిర్మాణం ప్రారంభించిన మధ్యతరగతి ప్రజలు కూడా మధ్యలోనే ఖర్చు పెరిగిపోవడంతో ఆలోచనలో పడ్డారు.