వెంకీని ఫాలో అవుతున్న చిరంజీవి

టాలీవుడ్ లో రీమేక్స్ అనగానే గుర్తొచ్చే హీరో వెంకటేష్. కెరీర్ స్టార్టింగ్ నుంచి రీమేక్స్ కు కేరాఫ్ గా నిలిచాడు వెంకీ. తాజాగా రిలీజ్ చేసిన నారప్ప, త్వరలోనే విడుదలకాబోతున్న దృశ్యం-2 కూడా రీమేక్ సినిమాలే. అందుకే వెంకీని అభిమానులు ముద్దుగా రీమేక్ రాజా అని పిలుస్తుంటారు. ఇప్పుడీ లిస్ట్ లోకి చిరంజీవి కూడా చేరిపోయారు. అచ్చుగుద్దినట్టు వెంకీని ఫాలో అయిపోతున్నారు.

చిరంజీవి ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. వీటిలో రీమేక్సే ఎక్కువగా ఉన్నాయి. బాబి దర్శకత్వంలో భోళాశంకర్ అనే సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఇది తమిళ్ లో హిట్టయిన వేదాళంకు రీమేక్. ఇక మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఇది కూడా రీమేక్. మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ కు రీమేక్ ఇది.

ఈ రెండు సినిమాలతో పాటు త్వరలోనే మరో రీమేక్ కు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇలా వెంకటేష్ రూటును ఫాలో అవుతున్నారు చిరంజీవి. ఇదే ఊపులో, ఈ ఇద్దరు హీరోలు కలిసి ఓ మంచి రీమేక్ లో మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందేమో. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సెక్షన్ ఇదే విషయంపై చర్చించుకుంటోంది.