అంతరించిపోతున్న అమెజాన్..

అమెజాన్ అంటే అదేదో షాపింగ్ వెబ్ సైట్ అనో, ఓటీటీ ప్లాట్ ఫామ్ అనో.. అనుకునే రోజులివి. కానీ అమెజాన్ ప్రపంచంలోనే అతి పెద్ద అడవి. బ్రెజిల్, పెరు, కొలంబియాలో విస్తరించి ఉంది. సూర్యకిరణాలు కూడా భూమిపై పడనంత దట్టంగా అలముకొని ఉన్న రెయిన్ ఫారెస్ట్ అమెజాన్. అధికశాతం బ్రెజిల్ లో ఉన్న అమెజాన్ అడవి విస్తీర్ణం 70లక్షల చదరపు కిలోమీటర్లు. పర్యావరణానికి పట్టుగొమ్మలా, భూమిపై వేసిన పచ్చని పందిరిలా కనిపించే ఈ అడవి పర్యావరణ సమతుల్యానికి దోహదపడుతోంది. భూతాపాన్ని తగ్గించడంలో అమెజాన్ పాత్ర ఎన్నదగినది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు అమెజాన్ అంతరించిపోయే జాబితాలో చేరింది. పచ్చని అటవీ సంపదంతా దోపిడీకి గురవుతోంది. కాపాడాల్సిన ప్రభుత్వాలే కార్పొరేట్ శక్తులతో కలసి అడవిని కాటేస్తున్నాయి. దీంతో గత 15ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా అమెజాన్ విస్తీర్ణం తగ్గిపోతోంది. ఏకంగా ఏడాదికి 13,235 చదరపు కిలోమీటర్ల మేర అడవి కుంచించుకుపోతోంది.

బ్రెజిల్ లో అమెజాన్ విస్తీర్ణం ఆందోళనకర స్థాయిలో తగ్గిపోతోంది. 2009 నుంచి 2018 మధ్య కాలంలో ఏడాదికి సగటున 6,500 చదరపు కిలోమీటర్ల మేర అమెజాన్ విస్తీర్ణం తగ్గిపోయింది. గత మూడేళ్లుగా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మూడేళ్లలో సగటున 11,405 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం మైదానంగా మారిపోయింది. ఇది మేరీలాండ్ అనే రాష్ట్రం విస్తీర్ణంతో సమానం. అమెజాన్ లో ఎక్కడికక్కడ అటవీ సంపద నాశనమైపోయింది. చెట్లు కొట్టేసి వాణిజ్య అవసరాలకు తరలించేస్తున్నారు.

అధ్యక్షుడు బోల్సొనారోపై ఆరోపణలు..
బ్రెజిల్ అధ్యక్షుడిగా బోల్సొనారో బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెజాన్ అంతరించిపోవడంలో వేగం పెరిగిందనే విమర్శలున్నాయి. అమెజాన్ పరిరక్షణే ధ్యేయంగా అక్కడ అధికారంలోకి వచ్చిన బోల్సొనారో.. ఇప్పుడు అటవీ సంపదను కాపాడే విషయంలో చేతులెత్తేశారు. దీంతో ఆయన హయాంలోనే అత్యథికంగా అటవీ సంపద హరించుకుపోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత పదిహేనేళ్లలో ఎప్పుడూ లేనంతగా అడవిని నాశనం చేస్తున్నారు, ఒక్క ఏడాదిలోనే 22శాతం ఎక్కువగా చెట్లు కొట్టేశారు. ఇది కేవలం బ్రెజిల్ కి పరిమితమైన అంశం కాదు, యావత్ ప్రపంచానికి ఇది ముప్పుగా పరిణమిస్తుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ అంతరించిపోవడం అంటే.. భూతాపాన్ని పెంచడమేనని, పర్యావరణ సమతుల్యతను చేజేతులా నాశనం చేయడమేనని హెచ్చరిస్తున్నారు.