తక్షణ సాయంగా రూ. వెయ్యి కోట్లు ఇవ్వండి.. ప్రధానికి సీఎం జగన్ లేఖ..!

తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. నాలుగు జిల్లాల్లోనూ వరదలు సృష్టించిన బీభత్సానికి పలు ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. వంతెనలు ధ్వంసమయ్యాయి. రోడ్లన్నీ నాశనమయ్యాయి. రాజంపేట, తిరుపతి ప్రాంతాల్లో వందలాది గ్రామాలు నీట మునిగి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది.

నాలుగు జిల్లాల్లోనూ పంటలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటి లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఏపీకి తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు అందించి ఆదుకోవాలని ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు వేర్వేరుగా లేఖలు రాశారు. పంట నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు.

‘తిరుపతి, తిరుమల,నెల్లూరు మదనపల్లె,రాజంపేట తదితర ప్రాంతాలు వరదలకు నీట మునిగిపోయాయి. 196 మండలాల్లో నష్టం వాటిల్లింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. నాలుగు జిల్లాల్లోనూ రహదారులు,చెరువులు,కాలువలు కోతకు గురయ్యాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. తక్షణ సాయంగా రాష్ట్రానికి రూ. వెయ్యి కోట్లు మంజూరు చేయాలి’ అని తన లేఖల్లో సీఎం జగన్ కోరారు.

వరదల వల్ల వ్యవసాయ రంగానికి నష్టం అంచనా సుమారు రూ.1353 కోట్లని, రాష్ట్ర వ్యాప్తంగా 1,42,862 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, ట్రాన్స్ ఫార్మర్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయని, రహదారులు ధ్వంసం కావడంతో సుమారు రూ. 1756 కోట్ల నష్టం వాటిల్లిందని, డ్యాములు, సాగునీటి శాఖకు రూ. 556 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖ నష్టం అంచనా రూ. 1252 కోట్లని.. వర్షాల వల్ల మొత్తం నష్టం అంచనా రూ.6054 కోట్లు అని జగన్ తన లేఖల్లో పేర్కొన్నారు.