అధికారం మీదేగా.. బిచ్చమెత్తుకోవడం ఏంటీ.. బీజేపీ నేతలను ప్రశ్నించిన సామాన్యుడు

ఇటీవల రాయలసీమలోని పలు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురిసి వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఇళ్ళు నీట మునిగి వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. వరద బాధితులను ఆదుకోవడం కోసం పలువురు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం బీజేపీ యువమోర్చా నేతలు కూడా విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు.

కాగా విరాళాలు సేకరిస్తున్న నాయకులకు మాత్రం ఓ సామాన్యుడి నుంచి చేదు అనుభవం ఎదురైంది. బిచ్చమెత్తుకొనే బదులు నిధులు మంజూరు చేయాలని కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీని అడగొచ్చు కదా.. అంటూ అతడు ప్రశ్నించాడు. దీంతో బీజేపీ నేతల దిమ్మతిరిగి పోయింది.

గుంటూరు నగరంలో యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ పార్టీ కార్యకర్తలతో కలిసి వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించడం మొదలు పెట్టాడు. అయితే బీజేపీ నాయకులకు అనూహ్యంగా ఓ సామాన్యుడి నుంచి చేదు అనుభవం ఎదురైంది. ‘కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది. పార్టీ పెద్దలకు చెప్పి నిధులు విడుదల చేయించొచ్చు కదా.. ఇలా ప్రజల వద్దకు వచ్చి ఎందుకు అడుక్కుంటున్నారు’ అంటూ ఓ వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో ఊహించని విధంగా ఎదురైన అనుభవానికి బీజేపీ నేతలు షాక్ అయ్యారు.

కాగా రాయలసీమతో పాటు తమిళనాడులో కూడా వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ రాష్ట్రంలో అప్పుడే కేంద్ర బృందాలు పర్యటిస్తూ వరద నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ విషయమై సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని, తక్షణ సాయంగా రూ.1000 కోట్లు ఇవ్వాలని ఆయన తన లేఖ ద్వారా విన్నవించారు.