కల నెరవేరిందంటున్న కేతిక

రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ, షార్ట్ గ్యాప్ లోనే లక్ష్య సినిమాతో మరోసారి థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా తన మనసులో మాట బయటపెట్టింది. హీరోయిన్ అవ్వాలనే తన కల చాలా తొందరగా నెరవేరినట్టు తెలిపింది.

“నా జీవితంలో ఒకే ఒక్క కల ఉండేది. నటిని అవ్వాలని అనుకున్నాను. అయ్యాను. కానీ అదెలా జరిగిందో నాకు కూడా తెలియదు. నా పేరెంట్స్ డాక్టర్స్. మాకు ఇండస్ట్రీతో సంబంధం లేదు. వారు నాకు ఓ ఏడాది టైం ఇచ్చారు. అంతలోనే నటిని అయ్యాను.”

ఇలా తన కల నెరవేరిన విషయాన్ని బయటపెట్టింది కేతిక. లక్ష్య సినిమాలో రితిక అనే పాత్ర పోషించిన కేతిక.. ఆ పాత్ర తీరుతెన్నుల్ని బయటపెట్టింది.

“లక్ష్య సినిమాలో రితిక తన మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తుంటుంది. నేను కూడా నిజ జీవితంలో అంతే. కానీ రితికలా పెళ్లి గురించి మాత్రం ఎక్కువగా ఆలోచించను. నాలాంటి వాళ్లను భరించడం కష్టం. మనసుకు ఏదనిపిస్తే అది చేసే వాళ్లతో వేగడం కష్టం.”

ఇలా తన రెండో సినిమాకు ప్రచారం కల్పిస్తూనే, తన వ్యక్తిగత విషయాల్ని కూడా బయటపెట్టింది కేతిక శర్మ. తనకు ప్రతి భాషలో నటించాలని ఉందని, తమిళ్ లో మాత్రం మేకర్స్ తన నుంచి ఎక్కువ నటన ఆశిస్తున్నారని, అందుకే ప్రస్తుతం తెలుగు సినిమాలే చేస్తున్నానని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.