ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ రిలీజ్ డేట్

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ట్రయిలర్ రెడీ అయింది. ఈనెల 9న ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు. ఈ మేరకు యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది.

నిజానికి ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ ను నిన్ననే విడుదల చేయాలనుకున్నారు. కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆకస్మిక మరణంతో ట్రయిలర్ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అలా వాయిదా వేసిన ట్రయిలర్ రిలీజ్ ఈవెంట్ ను 9వ తేదీన నిర్వహించనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా సిరివెన్నెల సాహిత్యం అందించిన విషయం తెలిసిందే.

డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల కాబోతోంది. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అలియాభట్ హీరోయిన్ గా నటించగా.. అజయ్ దేవగన్, శ్రియ, సముత్తర ఖని ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.