ఆడ బొమ్మలకు తలలు తీసేయండి.. తాలిబన్ల ఆదేశం..

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం పెచ్చుమీరిపోతుందని అనుకున్నారంతా. ఒక్కసారిగా తమ పైత్యాన్ని వారు బయటపెట్టలేదు కానీ.. విడతలవారీగా తాలిబన్ల అరాచకాలు ఎలా ఉంటాయో రుచి చూపిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీల్లో కో ఎడ్యుకేషన్ లేకుండా చేయడం, మహిళా ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయించడం.. ఇలా రకరకాలుగా మహిళలపై తమ విద్వేషాన్ని బయట పెడుతున్నారు.

తాజాగా బట్టల షాపుల్లో కనిపించే ఆడ బొమ్మలకు తలలు తీసేయాలంటూ తాలిబన్ ప్రభుత్వం ఓ వింత ఆదేశాన్నిచ్చింది. బట్టల షాపులు, పెద్ద పెద్ద షోరూముల్లో కొత్త డిజైన్లను ప్రమోట్ చేయడానికి మానిక్విన్ లను ఉపయోగిస్తారు. బొమ్మలకు దుస్తులు తొడిగి వాటిని అద్దాల వెనక అమరుస్తారు. ఇకపై అలా ఉంచే ఆడవారి బొమ్మలకు తలలు ఉండకూడదనేది తాలిబన్ల ఆదేశం.

మొదట్లో అసలు ఆడబొమ్మలే షాపుల్లో ఉండకూడదని ఆదేశాలిచ్చారు కానీ, వ్యాపారులనుంచి వ్యతిరేకత రావడంతో.. ఆ బొమ్మల తలలు మాత్రం కనిపించకూడదని తాజాగా వాటిని సవరించారు. ఆఫ్ఘన్ ప్రభుత్వంలో మత సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలిచ్చింది.

ఎందుకీ వివక్ష..?
మానిక్విన్ లు.. అంటే ప్రచారానికి పనికొచ్చే ఈ బొమ్మలు షరియా చట్టానికి వ్యతిరేకం అంటున్నారు. విగ్రహారాధన అనేది ఇస్లాంలో నిషిద్ధం అని, ఇలాంటి బొమ్మలను విగ్రహాలుగా ఆరాధించే ప్రమాదం ఉందని, అందుకే వాటికి తలలు ఉండకూడదని వితండవాదం తెరపైకి తెచ్చారు తాలిబన్ పాలకులు. అయితే ఇందులో మగవారి బొమ్మలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇలాంటి తలతిక్క ఆదేశాలతో తాలిబన్ పాలకులు సామాన్య పౌరులకు, ఆఫ్ఘనిస్తాన్ లోని వ్యాపార వర్గాలకు చుక్కలు చూపెడుతున్నారు.