బెంగాల్ లో అమిత్ షా.. పంజాబ్ లో మోదీ.. అవమాన పరంపర..

ప్రధానమంత్రి పర్యటనకు వస్తున్నారంటే ఆ హడావిడి, హంగామా వేరే స్థాయిలో ఉంటుంది. రెండ్రోజుల ముందుగానే పరిసరాలన్నీ పరిశుభ్రంగా మారిపోతాయి, అనుమానితులెవరూ లేకుండా పోలీసులు జల్లెడ పడతారు, ఫైనల్ గా ప్రధాని వాహనాలు వెళ్లే గంట ముందు, అరగంట తర్వాత ఆ రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తాయి. కానీ పంజాబ్ లో జరిగింది వేరు, కనీసం ప్రధాని వాహనాలు వెళ్లడానికి కూడా రోడ్డు మార్గం అనుకూలించలేదు. నిరసన అనుకోండి, స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహం అనుకోండి.. ప్రధాన మంత్రి నిరాశగా వెనుదిరిగి వెళ్లడం మాత్రం కలకలం రేపింది. దీన్ని అవమానంగా బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోంది. భద్రతా వైఫల్యం అంటూ వివరణ కోరింది. అయితే పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ మాత్రం దీన్ని కొట్టిపారేశారు. మోదీ సభకు అనుకున్నంతగా జనం రాకపోవడంతో ఈ సాకు చూపించి ఆయన టూర్ రద్దు చేసుకున్నారని ఆరోపించారు.

పంజాబ్ ఎన్నికల వేళ, ప్రధానికి అవమానం జరిగిందని భావిస్తున్న వేళ.. చాలామంది గతంలో బెంగాల్ ఎన్నికల ప్రచార పర్వంలో అమిత్ షా కి కూడా ఇలాగే అవమానం జరిగిందని గుర్తు చేస్తున్నారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హోం మంత్రి అమిత్ షా అక్కడికి వెళ్లారు. మూడు చోట్ల ఆయన పర్యటన ఖరారు చేసుకుంటే.. రెండు చోట్ల హెలికాప్టర్ ల్యాండింగ్ కి స్థానిక అధికారులు అనుమతివ్వలేదు. దాంతో ఆయన అసంపూర్తిగా పర్యటన ముగించుకుని వెళ్లారు. అప్పట్లో అమిత్ షా కి జరిగిన అవమానమే ఇప్పుడు మోదీకి జరిగిందని, అప్పుడు బెంగాల్ లో బీజేపీ ఓడిపోయినట్టే, ఇప్పుడు పంజాబ్ లో కూడా బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెబుతున్నారు.

పంజాబ్ లో వేడి చల్లారలేదా..?
రైతు చట్టాలను వెనక్కు తీసుకోడానికి పంజాబ్ ఎన్నికలే ముఖ్య కారణం అనే ప్రచారం కూడా ఉంది. అయితే నూతన చట్టాల రద్దు తర్వాత రైతు సంఘాల నేతలకు పాపులార్టీ పెరిగింది. అదే సమయంలో చట్టాలను రద్దు చేసినందుకు బీజేపీపై మాత్రం సింపతీ పెరగలేదు. పైగా.. చట్టాలను తిరిగి తీసుకొచ్చే అవకాశమున్నట్టు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీపై మరిన్ని అనుమానాలు ముసురుకున్నాయి. దీంతో పంజాబ్ లో మోదీకి నిరసన తెలిపేందుకు స్థానిక రైతులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. మొత్తమ్మీద పంజాబ్ లో ప్రధాని పర్యటించకుండానే వెనక్కి తిరిగిరావడం మాత్రం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.