ప్రతి వేవ్ లో ఆ నిర్మాతకు కరోనా

ఇప్పటివరకు రెండు దశల కరోనా వచ్చింది. ఇప్పుడు మూడో వేవ్ మొదలైంది. ఈ 3 వేవ్స్ లో కరోనా వైరస్ కు గురయ్యారు నిర్మాత బండ్ల గణేశ్. అవును.. బండ్ల గణేశ్ కు మరోసారి కరోనా సోకింది. టాలీవుడ్ లో ఇలా వరుసగా ప్రతి వేవ్ లో కరోనాకు గురైన ఏకైక వ్యక్తి బహుశా బండ్ల గణేష్ ఒక్కరే.

గడిచిన 3 రోజులుగా తన వ్యాపార నిమిత్తం ఢిల్లీలో ఉన్నారు గణేశ్. హైదరాబాద్ వచ్చిన వెంటనే మరోసారి ఆయనలో కరోనా లక్షణాలు కనిపించాయి. అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. తనకు మాత్రమే కరోనా సోకిందని, కుటుంబ సభ్యులంతా సురక్షితంగా ఉన్నారని బండ్ల గణేశ్ ప్రకటించారు.

ప్రస్తుతం తన ఇంట్లోనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు బండ్ల. అపోలో హాస్పిటల్ వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.

కరోనా ప్రారంభమైన తొలి దశలోనే బండ్ల గణేశ్ కు వైరస్ సోకింది. ఆ తర్వాత సెకెండ్ వేవ్ లో మరోసారి వైరస్ బారిన పడ్డారాయన. సెకెండ్ వేవ్ లో తను చావు వరకు వెళ్లొచ్చినట్టు తెలిపారు. ఆ టైమ్ లో చిరంజీవి తనను ఆదుకున్నారనే విషయాన్ని కూడా బయటపెట్టారు. ఇప్పుడు మరోసారి బండ్లకు వైరస్ ఎటాక్ అయింది.

ప్రస్తుతం తను హోం ఐసొలేషన్ లో ఉన్నానని, గడిచిన కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా పరీక్షలు చేయించుకొని, క్వారంటైన్ లో ఉండాలని కోరారు బండ్ల.