రేపటి నుంచి అందుబాటులోకి తిరుమల రెండో ఘాట్ రోడ్డు..!

తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డును వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం రాత్రి నుంచి భక్తులకు అందుబాటులోకి తెస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కొద్దిరోజుల కిందట తిరుపతి, తిరుమలలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తిరుమల రెండో ఘాట్ రోడ్డు లో మూడు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగి పడ్డ ప్రాంతంలో రోడ్డు కూడా భారీగా ధ్వంసమైంది. దీంతో అప్పటి నుంచి రెండో ఘాట్ రోడ్డు మూసివేశారు.

భక్తులు ఒక ఘాట్ రోడ్డు ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. వాహనాల రద్దీ అధికంగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా కొద్ది రోజులుగా రెండో ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్నారు. రోడ్డు దెబ్బతిన్న ప్రాంతంలో పెద్ద పెద్ద లోయలు ఉండడంతో రోడ్డు పక్కన పటిష్టంగా గోడలు కట్టారు. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి.

తాజాగా ఈ పనులను పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుక సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో మంగళవారం రాత్రి నుంచి రెండో ఘాట్ రోడ్డును భక్తులకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.

మరోవైపు అన్నమయ్య నడక దారిలో కూడా రోడ్డు నిర్మించాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రోడ్డు ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై ఆ ప్రాంతాన్ని కూడా అధికారులు పరిశీలించారు. అతి త్వరలో రోడ్డు నిర్మాణానికి టెండర్లు కూడా పిలుస్తామని కొద్దిరోజుల కిందట టీటీడీ ప్రకటించింది.